ఐలాపూర్‌ హైడ్రా కూల్చివేతలపై గందరగోళం | More Confusion Over Ailapur Hydraa Demolitions | Sakshi
Sakshi News home page

ఐలాపూర్‌ హైడ్రా కూల్చివేతలపై గందరగోళం

Apr 14 2026 10:19 AM | Updated on Apr 14 2026 10:40 AM

More Confusion Over Ailapur Hydraa Demolitions

సాక్షి, హైదరాబాద్‌/సంగారెడ్డి: అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత దాకా ఆపరేషన్‌ నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా అంటోంది. 

ఐలాపూర్‌లో ఓ భారీ భవనంపై కూల్చివేతపై కోర్టు సోమవారం స్టే ఆర్డర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భవనం పూర్తిగా కూల్చకుండా వదిలేసింది హైడ్రా. కూల్చకుండా వదిలేస్తే పక్కన ఉన్న భవనంపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిగా కూల్చాల్సిందేనని అంటున్నారు. కానీ.. హైడ్రా చర్య కోర్టు ధిక్కరణ(కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు) కిందకే వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఒకవేళ మొండిగా కూల్చివేతలు మొదలుపెడితే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. 

ఏం జరిగిందంటే.. 
శనివారం అమీన్‌పూర్‌ మండల పరిధిలో పలు చోట్ల అక్రమ కట్టడాలను కూల్చేసింది హైడ్రా. ఆ సమయంలోనూ విపరీతమైన గందరగోళం నెలకొంది. కోర్టు ఆదేశాలతో కూల్చివేత ఆగిందని కాసేపు.. హైడ్రానే కావాలని కాసేపు కూల్చివేతలు ఆపిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఈలోపు ఐలాపూర్‌ కూల్చివేతలపై ఓ వృద్ధుడు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూడా పట్టించుకోకుండా కూల్చివేతకు దిగారని పేర్కొన్నారు. అయితే.. 

హైడ్రా తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) వాదిస్తూ.. కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్‌లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందేనని.. పైగా ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదంటే తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement