5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు.. 40 వేల దరఖాస్తులు

More Than 40 Thousand Application For Staff Nurse Posts In Telangana - Sakshi

గడువు పొడిగింపుతో మరో 15 వేలు దరఖాస్తులు వచ్చే చాన్స్‌ 

ఆసుపత్రుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందడానికి అభ్యర్థుల యాతన  

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. వైద్య, ఆరోగ్య శాఖ నెలన్నర క్రితం 5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారమే ముగియగా, తాజాగా దానిని 21వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఏకంగా 40 వేల దరఖాస్తులు రాగా, గడువు పొడిగింపుతో మరో 15 వేల మంది దరఖాస్తు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వెయిటేజీకి సంబంధించి అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం, ఇతరత్రా కారణాలతో అనేకమంది దరఖాస్తు చేసుకోలేకపోవడంతో గడువు పొడిగించారు. ఒక్కో ఉద్యోగానికి 10 నుంచి 11 మంది పోటీ పడే అవకాశముందని అంచనా. ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ.36,750–1,06,990 మధ్య ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక రాత పరీక్ష వివరాలను మెడికల్‌ బోర్డు ప్రకటించనుంది. ఏదైనా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశముంది. పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మెడికల్‌ బోర్డు తెలిపింది.  

అధికారుల అలసత్వం 
రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరో గ్య కేంద్రాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నవారు అనుభవ ధ్రువీకరణ పత్రా లు పొందాలని బోర్డు సూచించింది. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి 6 నెలలకు 2.5, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు.

అయితే అనేకమంది అభ్యర్థులకు సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో చుక్కలు చూపిస్తున్నారు. నాన్‌ క్రీమీ లేయర్‌ సర్టిఫికెట్ల జారీలో కూడా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని కోసం ఎమ్మార్వో ఆఫీసుల్లోని కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు దీనిపై దృష్టిపెట్టి ధ్రువీకరణ పత్రాలు సులువుగా జారీచేసేలా ఆదేశాలు జారీచేయాలని నర్సింగ్‌ సంఘాల నాయకులు కోరుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top