
వెనుకబడిన జిల్లాలకు పీఎమ్‌ఈజీపీతో ఊరట
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి.. కేంద్రం అమలు చేస్తున్న విధానాల ఫలితంగా ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్’ ప్రారంభమైన 2020 జూలై 1 నుంచి 2025 జూలై 31 వరకు.. తెలంగాణలో నమోదైన ఎంటర్‌ప్రైజ్‌ల ద్వారా 1.59 కోట్ల మందికి ఉపాధి లభించిందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ వెల్లడించింది.
గురు వారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఈ ఐదేళ్ల కాలంలో నల్లగొండ జిల్లాలో 5.92 లక్షల మందికి, సూర్యాపేట జిల్లాలో 5.44 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. పశుపోషణ, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్, తేనె పరిశ్రమలు వంటి సంప్రదాయ రంగాలు కూడా పీఎంఈజీపీ పథకంలో భాగంగా అంగీకరించామని, అన్ని రాష్ట్రాల్లోనూ, వెనుకబడిన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.