
కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు
హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో 24 మంది ఎంపిక
ఎంపిక కాని మిగతావారికి ఇతర రౌండ్లలో అవకాశం
ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈనెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు.. ఆటవిడుపునకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి రెండు రోజులుగా మేధోసంపత్తితో అలరిస్తున్నారు. ఇప్పటిదాకా ఆటవిడుపుగా సాగిన పోటీలు అభిమానులకు రసవత్తరంగా మారగా, పోటీదారులకు అగి్నపరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది.
సత్తా చాటిన 24 మంది: టీ–హబ్‌లో రెండు రోజులపాటు జరిగిన హెడ్ టు హెడ్ చాలెంజ్ రౌండ్‌లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా, 24 మందిని ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయనిర్ణేతలు తేల్చారు. హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో ఇండియా, అమెరికా, పోలండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, మాల్టా, ఇటలీ, ఇండోనేసియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎస్టోని యా, జర్మనీ, బ్రెజిల్, కేమాన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, జమైకా, అర్జెంటీనా, ఐర్లాండ్, ఆ్రస్టేలియా, శ్రీలంక, ఇథియోపియా, కామె రూన్, కెన్యా ముద్దుగుమ్మలు విజేతలుగా నిలిచారు. వీరు 23న జరిగే టాలెంట్ కాంపిటీషన్‌లో తలపడి తమ ఖండంలోని టాప్–10లో భాగమవుతారు.
వారికి మళ్లీ సత్తా చాటే చాన్స్: హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో 24 మంది విజేతలుగా నిలిచి సెమీఫైనల్ బెర్తుకు చేరువయ్యారు. ఈ రౌండ్‌లో ఓడిన వారు ఎలిమినేట్ కారు. వారు పోటీలో ఇతర విభాగాలైన మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్, జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షోల్లో పాల్గొనవచ్చు. వీటిల్లో మెరుగ్గా రాణిస్తే తదుపరి రౌండ్లకు అర్హత సాధిస్తారు. అయితే, ఆ 24 మందితో పోలిస్తే వీరికి ఎక్కువ సవాళ్లు ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల్లో హెడ్ టు హెడ్ చాలెంజ్‌ను ఫాస్ట్–ట్రాక్ ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఇందులో విజేతలు నేరుగా క్వార్టర్–ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
⇒ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్: ఈ పోటీ మే 22న శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు సంగీతం, నృత్యం, కళలు ఇతర ప్రతిభలను ప్రదర్శిస్తారు.
⇒ టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్: ఇది మే 24న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉంటుంది.
⇒ జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షో: మే 25న హైటెక్స్‌లో జరుగుతుంది, ఇందులో తెలంగాణలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు కూడా హాజరవుతారు.
⇒ ఈ అన్ని పోటీల్లో వడపోత కార్యక్రమం కొనసాగుతుంది. అమెరికా–కరేబియన్, ఆసియా–ఓషియానా, ఆఫ్రికా, యూరప్.. ఈ నాలుగు విభాగాల్లో తొలుత ఒక్కో ఖండం నుంచి 10 మంది ఎంపికవుతారు. తదుపరి రౌండ్‌లో ఆ సంఖ్య ఐదుకు పరిమితమవుతుంది. ఆ తర్వాత ఇద్దరు చొప్పున ఉంటారు. 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో మొత్తం 8 మంది మిగులుతారు. వారిలో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌ను ఎంపిక చేస్తారు. విజేతకు మిస్‌వరల్డ్–2024 క్రిస్టీనా పిజ్కోవా రూ.6.21 కోట్ల విలువైన కిరీటాన్ని అలంకరింపజేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలే ఈనెల 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుంది.