
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి (చార్మినార్) నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.

రాత్రికి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు వీరు చుడీ బజార్‌లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేయనున్నారు. అంతే కాకూండా వీరికి మెహందీ పెట్టడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఏమిటీ హెరిటేజ్ వాక్?
హైదరాబాద్ నగరం, చారిత్రక నేపధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి, ‘ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్‘ సంస్థ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించి, వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హెరిటేజ్ వాక్‌లో భాగంగా, పాల్గొనేవారు సందర్శించే ప్రముఖ చారిత్రక కట్టడాలలో చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, బద్షాహీ అషూర్‌ఖానా, ఖిల్వత్ ముబారక్, లాడ్ బజార్ వంటివి ఉన్నాయి. ఇవి హైదరాబాద్ నగర చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.సందర్శకులకు స్థానిక గైడ్‌ల ద్వారా ప్రతి కట్టడానికి సంబంధించిన చరిత్ర, శిల్పకళా విశేషాలు వివరిస్తారు.