జనవరి 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి 

Minister Vemula Prashanth Reddy About Double Bedroom Houses Allotment - Sakshi

పంపిణీకి సిద్ధంగా 62 వేల ఇళ్లు 

అర్హులకు ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు  

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమీక్ష   

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 నాటికి పూర్తి చేయా లని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రెటరీ సునీల్‌ శర్మలతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఆహారభద్రత కార్డులు, అద్దె ఇళ్లలో ఉన్న వారి జాబితాను ఎంపిక చేయాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో హైదరాబాద్‌కు పంపాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 91 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టామని వివరించారు.

హైదరాబాద్‌ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాగా, 62 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీల్లో విద్యుత్, సీవరేజ్, రహదారుల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. కాగా, సెక్రటేరియట్‌ భవనం, అమరవీరుల స్మారకచిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల, సోమేశ్‌ కుమార్‌ బీఆర్‌కేఆర్‌ భవన్‌ 10వఅంతస్తునుంచి పరిశీలించారు.

26లోగా పోడు సర్వే పూర్తి చేయాలి.. 
ఈ నెల 26లోగా పోడు భూముల సర్వే పూర్తి చేసి, గ్రామ సభల ద్వారా వివరాలను సబ్‌ కమిటీకి పంపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. అలాగే క్రీడా ప్రాంగణాలు, బృహత్‌ ప్రకృతి వనాలను లక్ష్యాల మేరకు పూర్తి చేసి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని కోరారు.  ధరణిలో వచ్చిన ఫిర్యాదులను, జీవో 58, 59 ప్రకారం ఉన్న సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని సీఎస్‌ సూచించారు.  

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ 
సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణాలను బీఆర్‌కేఆర్‌ భవన్‌ పదో అంతస్తు నుంచి  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలిస్తున్న 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top