ప్రతి విద్యార్థికీ ఉపాధి లభించాలి

Minister Sabitha Indra Reddy To Make Changes In Teaching System In Telangana - Sakshi

బోధన విధానంలో సమూల మార్పులు జరగాలి

‘సాధికార విద్య’పై సెమినార్‌లో మంత్రి సబిత

విద్యలో నాణ్యత పెరగాలన్న వక్తలు

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు ఉపాధి కల్పించేలా ప్రస్తుత బోధన విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా­రెడ్డి అన్నారు. ఈ దిశగా విశ్వవి­ద్యాలయాల ఉప కులపతులు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, టీసీఎస్, టీఎస్‌ ఆన్‌లైన్‌ నేతృత్వంలో ‘ఉపాధి అవకాశాల పెంపునకు సాధికార విద్య’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో సెమినార్‌ జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబిత మాట్లాడుతూ, డిగ్రీలతో బయట­కొచ్చే ప్రతి విద్యార్థికీ ఉపాధి లభించేలా చూడాలన్నారు. నైపుణ్యత పెంచడం ద్వా­రానే ఇది సాధ్యమని తెలిపారు. విద్యార్థులు హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల్లోనే ప్రవే­శాలు కావాలని కోరుకుంటున్నారని, అలా కాకుండా అన్ని కాలేజీల్లోనూ ప్రవేశాలు కోరుకునే విధంగా ఆయా కాలేజీల్లో బోధన విధానంలో మార్పు తేవాలని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఏడు లక్షల మందికి రాష్ట్రంలో ఉపాధి కల్పించినట్టు తెలిపారు. 

నైపుణ్యమే ముఖ్యం
నైపుణ్యంతో కూడిన విద్యతోనే ఉపాధి అవకాశాలుంటాయని ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు్టగా ఇంటర్న్‌షిప్‌ ఉండాలన్నారు. మార్కులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మంచి ప్రాజెక్టు వర్క్‌పైనే దృష్టి పెట్టాలని సూచించారు. డిగ్రీ చేతికి రాగానే ఉపాధి వెంట పరుగులు పెట్టేకన్నా, పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టాలని చెప్పారు.

20ఏళ్ళ నాటి పుస్తకాలతోనే ఇంకా బోధన సాగుతుండటం శోచనీయమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా విద్య సాగాలని పేర్కొన్నారు. విద్యలో నాణ్యత, పరిణతి పెరగాల్సిన అవసరం ఉందని టీసీఎస్‌ భారత విభా­గం ముఖ్య అధికారి గోపాలకృష్ణ జీఎస్‌ఎస్‌ తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టిందని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. హానర్స్, బీఎస్సీలో డేటా సైన్స్‌ వంటి కోర్సులను ఉదహరించారు. మండలి వైఎస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి వెంకటరమణ, పలు యూనివర్శిటీల వీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top