కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. ఘాటైన లేఖ

Minister KTr Slams Centre Negligence On HYD Developement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరికి మంగళవారం ఘాటైన లేఖ రాశారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు చాలా తక్కువ జనాభా కలిగిన వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌, మీరట్ వంటి చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించడం ముమ్మాటికి వివక్షేనని మండిపడ్డారు. 

జనాభా రద్దీ తక్కువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం, హైదరాబాద్ నగరానికి మాత్రం మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడం తనకు అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇస్తుందని మంత్రి విమర్శించారు. తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వకుండా కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ధ్వజమెత్తారు. 

దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా హైదరాబాద్ ఉన్నదని ఇలాంటి నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాదన అర్ధరహితమని అన్నారు.  యూపీలోని అనేక చిన్న నగరాలు, పట్టణాలు మెట్రో రైల్ ప్రాజెక్టులకు అర్హత సాధించినప్పుడు హైదరాబాద్ మెట్రో నగరానికి మాత్రం ఎందుకు ఆ అర్హత పొందదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్న వివిధ రంగాల్లోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. దేశంలో తెలంగాణతో పోల్చుకుంటే ఎలాంటి అర్హతలు లేకున్నా ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు ప్రాజెక్టులను కట్టబెడుతూ తెలంగాణకు పదేపదే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న పక్షపాత దృక్పథమేనని విమర్శించారు.

ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండవ దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతోపాటు డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ (డీపీఅర్) సైతం అందించామన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్‌డీటీ(PHDT) గణాంకాలు, ఇతర అర్హతలను, సానుకూలతలను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మున్సిపల్ శాఖ తరపున గతంలో అందించిన సమాచారం తాలూకు నివేదికలను ఈ సందర్భంగా కేటీఆర్ జతచేశారు.

కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరిని వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను వివరించేందుకు తాను స్వయంగా అనేకసార్లు ప్రయత్నించినా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ అన్నారు. అయితే కేంద్రమంత్రి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగర మౌలిక వసతుల ప్రాజెక్టులు విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, అవసరాలే ప్రాతిపదికగా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించిన్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసందుకు, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top