ప్రగతి భవన్‌లో మంత్రి ‘కేటీఆర్‌’ ఎమోషనల్‌ సీన్‌..

Minister KTR Helped Rudra Rachana To Study Got Emotional - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆడ పిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో  నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర రచన అనే ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకు అవసరమైన సహాయం చేసి ఆమె ఇంజనీరింగ్ పూర్తి అయ్యేలా చూశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటూ  జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది.
చదవండి: ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్‌బండ్‌’.. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు బేఖాతర్‌!

ఆ తర్వాత హైదరాబాద్ యూసుస్‌గూడాలోని స్టేట్ హోంలో ఉంటూ పాలిటెక్నిక్‌ని పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంబ్‌లో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేకపోయింది. రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా 2019లో తెలుసుకున్న కేటీఆర్, ఆమెను ప్రగతి భవన్ పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజనీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్‌లో  నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ను రుద్ర రచన కలిసింది. ఆమె చదువు, ఉద్యోగాల విషయం తెలుసుకుని కేటీఆర్ సంతోషపడ్డారు. తనకంటూ ఎవరూ లేకున్నా ఆత్మ విశ్వాసంతో రుద్ర రచన జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు.

తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్.. ఒక అన్నగా అండగా నిలబడ్డారని, తన కల సాకారం కోసం తండ్రిగా తపించారని రచన భావోద్వేగానికి లోనయింది. ఈ సంవత్సరం రాఖీ కట్టాలనుకున్నానని అయితే కేటీఆర్ కాలికి గాయం అయిందన్న విషయం తెలుసుకుని బాధపడ్డానని రుద్ర రచన చెప్పింది. తాను పొదుపు చేసుకున్న డబ్బులతో  వెండి రాఖీ తయారు చేయించానన్న రచన, వాటిని కేటీఆర్‌కు కట్టింది. రచన మాటలకు, అభిమానానికి మంత్రి కేటీఆర్  భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న తాను, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని వాటిని సవాలుగా స్వీకరించి నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్నా తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఇంజినీరింగ్ ఫీజు, హాస్టల్ బకాయిలు మొత్తం నగదు సహాయాన్ని కేటీఆర్ అందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top