అందుకే మెట్రో రైలుకు ఆర్థిక నష్టాలు: కేటీఆర్‌

Minister KTR Explanation On Why Hyderabad Metro Losses - Sakshi

 

‘రోజు 15 లక్షల మంది ప్రయాణికులు’ సాధ్యం కాలేదు

ఇప్పటి వరకు 4 లక్షల ప్రయాణికులే అత్యధికం

ప్రభుత్వం ఇచ్చిన భూములను ఎల్‌ అండ్‌ టీ సద్వినియోగంచేసుకోలేదు

శాసన మండలిలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరానికి కొత్త వన్నెలద్దిన మెట్రోరైలు నిర్వహణ నష్టదాయకంగా ఉందని రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దేశంలోనే తొలిసారిగా పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్వహణలో అంచనాలు తప్పాయని ఆయన వివరించారు. మైనారిటీ సంక్షేమం, పాతబస్తీ అభివృద్ధిపై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఎక్కడైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మెట్రో ప్రాజెక్టులు చేపడతాయని, హైదరాబాద్‌లో మాత్రమే ప్రైవేటు వారిని భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. పీపీపీ విధానంలో ఎల్‌అండ్‌టీ కంపెనీ మెట్రోరైలు నిర్మాణం, నిర్వహణ కాంట్రాక్టు పొందినప్పటికీ, మారిన పరిస్థితుల్లో ఆశించిన ఆదాయం సమకూరడం లేదని అన్నారు. మెట్రో ప్రాజెక్టులో పెట్టిన పెట్టుబడికి 50 శాతం ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయించడం ద్వారా సమకూరాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిరోజు 15 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తే పెట్టిన పెట్టుబడిలో 50 శాతం సమకూరుతుందని, అయితే ఇప్పటి వరకు మెట్రో చరిత్రలో ఒకరోజు 4 లక్షల మంది ప్రయాణించడమే అత్యధిక సంఖ్యగా ఆయన పేర్కొన్నారు.  

భూములిచ్చినా ఫలితం లేదు.. 
కోవిడ్‌ నేపథ్యంలో ఏడాదికి పైగా ప్రయాణికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. మరో 45 శాతం ఆదాయం ఎల్‌ అండ్‌ టీకి ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు జరిపి వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా సమకూర్చుకోవాలని, 5 శాతం ఆదాయం అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలో వస్తుందన్నారు. ఎల్‌ అండ్‌ టీకి 270 ఎకరాల భూములు ఇచ్చినా సద్వినియోగం కాలేదని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపు మీదున్నా, భూములకు రెక్కలు వచ్చినా ఎల్‌ అండ్‌ టీ ఆ భూములను సద్వినియోగం చేయలేదని అన్నారు. నిర్మాణాలకు అనుగుణంగా 18 కోట్ల అడుగుల స్థలం ఎల్‌ అండ్‌ టీ వద్ద ఉంటే, కేవలం 1.80 లక్షల అడుగుల వరకే నిర్మాణాలు జరిపి లీజుకు ఇచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌ టీ నిర్వహణలో ఉన్న మెట్రో ఆర్థికంగా అస్తవ్యస్థంగా తయారైందని తెలిపారు.
సాఫ్ట్‌లోన్‌ అడిగారు.. 
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు మెట్రో కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ఎయిర్‌పోర్టుకు ఇచ్చిన విధంగా తమకు సాఫ్ట్‌లోన్‌ ఇవ్వాలని విజ్ఞఫ్తి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం తనతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని ఆదేశించినట్లు కేటీఆర్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో మెట్రోరైలు విస్తరణకు కొంత సమయం పడుతుందని అన్నారు.  
 
పాతబస్తీ మెట్రో రూట్‌లో 93 మతపరమైన కట్టడాలు 
తొలిదశ ప్రాజెక్టులోనే పాతబస్తీకి కూడా మెట్రో సదుపాయం కల్పించాల్సి ఉన్నమాట వాస్తవమేనని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌ నుంచి 5.5 కిలోమీటర్ల దూరం ఫలక్‌నుమా దాకా మెట్రో నిర్మాణం జరగాల్సి ఉందని అన్నారు. అయితే ఈ దారిలో 93 మతపరమైన కట్టడాలు ఉన్నాయని, ఇరువర్గాలను ఒప్పించే విషయంలో ఆలస్యమైందని అన్నారు. మతపరమైన అంశాలతో వివాదం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top