‘ప్రైవేట్‌’కు వెళ్లి అప్పులపాలు కావొద్దు..

Minister Harish Rao Teleconference On Corona Control Measures - Sakshi

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సంగారెడ్డి: కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. కిట్లు లేవని సాకులు చెప్పొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,సర్పంచ్‌లతో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘జిల్లాకు అవసరమైన పీపీఈ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, హోం క్వారంటైన్ కిట్లు  తెప్పించాం. ఎలాంటి కొరత లేదని’’ స్పష్టం చేశారు.

ప్రతీ రోజు పీహెచ్‌ఎసీలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని..లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక దశలో కరోనాను గుర్తించకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని.. కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దని ఆయన సూచించారు. కరోనా బాధితులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం సరికాదని. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు.

ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని.. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని ప్రజలకు ఆయన సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారో.. అదే వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని వివరించారు.

కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ఎలాంటి ఆందోళన చెందకుండా పనిచేయాలని ఆయన సూచించారు. పాజిటివ్‌ కేసు ఒక్కటి వచ్చినా ప్రైమరీ కాంటాక్ట్‌ కింద అందరికీ టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా బారిన పడిన వారితో ప్రతీ రోజూ డాక్టర్లు, ఎఎన్ఎంలు మాట్లాడి.. వారిలో ఆత్మస్థైర్యం నింపాలని పేర్కొన్నారు. ‘‘కరోనా రాకుండా రోజూ వేడి నీళ్లు తాగాలి. ఆవిరి పట్టాలి. మాస్కులు తప్పకుండా ధరించాలి. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తే ఎవరూ అలక్ష్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని’’ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top