హలో వెంకటయ్య.. నేను హరీశ్‌ను! 

Minister Harish Rao Phone Call To Oil Farm Formers - Sakshi

సిద్దిపేటలో ఆయిల్‌ పామ్‌ సాగు, లాభాలపై వివరాలు వెల్లడి 

మంత్రి హరీశ్‌రావు: ‘హలో.. వెంకటయ్య నేను హరీశ్‌ను మాట్లాడుతున్నాను..  
వెంకటయ్య: సార్‌.. సార్‌.. చెప్పండి 
హరీశ్‌రావు: అంతా బాగున్నారా? నీళ్లు మంచిగా ఉన్నాయా? బోరు పోస్తుందా.. ? 
వెంకటయ్య: సార్‌ బాగున్నాం.. నీళ్లకు ఢోకాలేదు..  
హరీశ్‌రావు: ఆయిల్‌ పామ్‌ గురించి మొన్న మీటింగ్‌లో విన్నావు కదా! ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు.. 
వెంకటయ్య: రెండు ఎకరాలు వేద్దామని అనుకుంటున్న సార్‌ 
హరీశ్‌రావు: రెండు ఎకరాలు వేస్తే ఏం లాభం.. మూడు ఎకరాలు సాగు చేయి..  
వెంకటయ్య: మీరు చెప్పినంక మాకేం భయం సార్‌.. మూడు కాదు.. నాలుగు ఎకరాల్లో పామ్‌ ఆయిల్‌ వేస్తా సార్‌..  
హరీశ్‌రావు: ఓకే వెంకటయ్య.. నీతోపాటు పక్క రైతులను కూడా సాగుచేయమని చెప్పు. మంచి లాభాలు వచ్చే సాగు. ఎకరానికి ప్రభుత్వం రూ.30 వేలు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుంది. ఫ్యాక్టరీని కూడా మన సిద్దిపేటలోనే ఏర్పాటు చేస్తున్నం. మంచి లాభం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది..  
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్యతో బుధవారం ఫోన్‌లో చేసిన సంభాషణ ఇది.  

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మొత్తం 55 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 28వ తేదీన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతుల ఉత్సాహాన్ని చూసిన మంత్రి హరీశ్‌రావు బుధవారం హైదరాబాద్‌ నుంచి 300 మంది రైతులతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు ఆయిల్‌ పామ్‌ వేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆయిల్‌ పామ్‌ దిగుబడి, లాభాలు, జిల్లాలో ఆయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు వంటి విషయాలను మంత్రి రైతులకు వివరించారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి జిల్లా రైతులకు దశల వారీగా ఆయిల్‌ పామ్‌ తోటలు సాగుచేసిన రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2వ తేదీన సిద్దిపేట నియోజకవర్గం నుంచి 150 మంది రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేటలకు పంపిస్తున్నామని, రైతులు అక్కడకు వెళ్లి ఆయిల్‌ పాం సాగులో మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్, హార్టికల్చర్‌ అధికారి రామలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top