మాట్లాడే అవకాశం ఇవ్వరా? 

Minister Errabelli Dayakar Rao Woman MP Concern - Sakshi

మంత్రి ఎర్రబెల్లి సభలో మహిళా ఎంపీపీ ఆందోళన

సాక్షిప్రతినిధి, వరంగల్‌/కమలాపూర్‌: తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ఓ మహిళా ఎంపీపీ ఆందోళన చేశారు. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో శనివారం జరిగింది. కమలాపూర్‌ మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు రూ.29.51 లక్షల విలువ గల వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనకందిన సమాచారం మేరకు స్థానిక ఎంపీపీ రాణి సభ మధ్యలో వచ్చారు. మంత్రి ప్రసంగం అనంతరం మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని, తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంటానని కోరారు.

అయితే ప్రొటోకాల్‌ ప్రకారం మంత్రి మాట్లాడిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి ఉండదని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభా వేదికపైనే తనకు మాట్లాడే అవకాశం ఎందుకివ్వరంటూ నిలదీశారు. వెంటనే ఆమెను వేదికపై నుంచి కిందకు పంపించేశారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. శనిగరం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త నిగ్గుల వేణు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని, శనివారం తమ ఇంటి ముందు బైక్‌ ఆపి ఈలలు వేస్తూ, సైగలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలతో తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళలతో కలసి హుజూరాబాద్‌– పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top