పక్షులు ఆమె పేషెంట్లు | Rani Thomas turns her love for animals into a veterinary hospital for exotic birds | Sakshi
Sakshi News home page

పక్షులు ఆమె పేషెంట్లు

Oct 29 2025 2:24 AM | Updated on Oct 29 2025 2:24 AM

Rani Thomas turns her love for animals into a veterinary hospital for exotic birds

మనుషులకు బాగోలేకపోతే ఆసుపత్రికి పరుగెడతారు. మరి రివ్వున ఆకాశంలో ఎగిరే గువ్వలకు దెబ్బ తగిలితే? తెల్లటి పావురాయి గొంతుకు దారం బిగిసి ఊపిరాడకపోతే? తియ్యటి రాగాలు పాడే కోయిలకు గాయమైతే? వీటి బాగోగులు చూడటానికి ఎవరున్నారు? ఇంకెవరు... రాణి మరియా థామస్‌. విహంగాలకు ఆరోగ్య సమస్యలుంటాయని గుర్తించి, కేరళలో వైద్యశాల ప్రారంభించి వైద్యం చేస్తున్నారామె. ఆ రాష్ట్రంలో విదేశీ పక్షులకు వైద్యం అందించే తొలి ఆసుపత్రిని ఆమె తీర్చిదిద్దారు.

కేరళ అలప్పుజా (అలెప్పి)కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంపోలీలోని ‘సారా బర్డ్స్‌ అండ్‌ ఎక్సోటిక్‌ యానిమల్స్‌ హాస్పిటల్‌’లో అడుగు పెట్టగానే మీకు ‘జంగిల్‌ బుక్‌’ గుర్తొస్తుంది. పచ్చనిచెట్లు, అరుదైన వృక్షజాతులు, మొక్కలు వాటితోపాటు జంతువులు, పక్షులు, వాటి అరుపులు, కేరింతలు... అన్నీ కలిసి అదొక ఆధునిక వనంలా కనిపిస్తుంది. ఆ వనానికి సృష్టికర్తే రాణి మరియా థామస్‌. ఆమె తన నానమ్మ ‘సారా’ పేరుతో నడుపుతున్న ఆ హాస్పిటల్‌లో 70 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. వాటిని తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు రాణి మరియా. కేరళలో అలా విదేశీ పక్షులు, జంతువులకు వైద్యం అందించే తొలి ఆధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం వెనుక తన తల్లిదండ్రులది కీలకపాత్ర అంటారామె.

పెంపకం నుంచి వైద్యానికి...
రాణి తల్లిదండ్రులు కె.టి. థామస్, బీనా నాలుగు దశాబ్దాలుగా విదేశీ పక్షులు, జంతువుల్ని పెంచుతున్నారు. వాటికి ఏదైనా జబ్బు చేసినా, దెబ్బ తగిలినా వైద్యం అందించడం ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మన దేశంలో ప్రధానంగా పశువుల ఆస్పత్రులు, పెట్‌ క్లినిక్‌లు దేశవాళి జంతువులు, మహా అయితే శునకాల వైద్యం అందించగలవుగాని విదేశీ పక్షులకు వైద్యం అందించడం అరుదు.

ఇది గుర్తించిన ఆ జంట తమ ఇద్దరు కూతుళ్లల్లో ఒక్కరైనా అటువంటి పక్షులకు వైద్యం చేసే వృత్తిని చేపడితే బాగుంటుందని భావించారు. తల్లిదండ్రుల భావాలను అర్థం చేసుకున్న రాణి ఆ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. తన చుట్టూ పెరిగే పక్షుల బాగోగులు చూడ్డంతోపాటు వాటికి వైద్యం అందించడం కోసం 2019లో ‘వెటర్నరీ ఎపిడెమియాలజీ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్ ’లో మాస్టర్స్‌ చేశారు. ఆ తర్వాత ‘పీజీ డిప్లమో ఇన్‌ వన్‌ హెల్త్‌’ పూర్తి చేశారు. 

60 లక్షలతో సొంత ఆస్పత్రి
భారతదేశంలో విదేశీ పక్షులు, జంతువుల పెంపకం పెరిగింది. జంతువులు, పక్షులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆసుపత్రులు ఉంటాయి కానీ విదేశీ పక్షులకు ఎలాంటి చికిత్స అందించాలో చాలామందికి తెలియదు. అత్యవసర స్థితిలో వైద్యం అందక చాలా పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనాలంటే తానే సొంతంగా వైద్యశాల ప్రారంభించాలని భావించారు రాణి. అందుకు సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేశారు. అడుగడగునా ఆమెకు అవాంతరాలు ఎదురయ్యాయి. పక్షులు, జంతువుల చికిత్సకు సంబంధించిన పరికరాలు చాలా ఖరీదుతో కూడుకున్నవి.

అయినా ఆమె వెనుకాడలేదు. పైగా అలెప్పి ఒక మోస్తరు ఊరు. అటువంటిచోట అంత ఖరీదైన ఆసుపత్రి పెట్టి ప్రయోజనం ఏమిటని చాలామంది విమర్శించారు. బేరాలు రాక త్వరలోనే మూసుకోవాల్సి వస్తుందని భావించారు. వాటిని లక్ష్యపెట్టకుండా కేరళలో తొలి విదేశీ పక్షులు, జంతువుల వైద్యశాలను తెరిచారు రాణి. కొన్నేళ్ళపాటు లాభాలు ఆశించకుండా పనిచేశారు. క్రమంగా ఆమె ప్రత్యేకత లోకానికి తెలిసింది. ఇప్పుడు కేరళ నలుమూలల నుంచి తమ పక్షులు, జంతువులకు వైద్యం కోసం ఆమె వద్దకు వస్తున్నారు. కొన్నిసార్లు తమిళనాడు, బెంగళూరు, కోల్‌కతా నుంచి కూడా పక్షులను తీసుకొస్తున్నారని వివరిస్తున్నారు రాణి.

మానవ తప్పిదాలే పక్షులకు ప్రమాదాలై...
మనుషులు చేసే తప్పిదాలే పక్షులకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయని అంటారు రాణి. 2017లో రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో జరిగిన వార్షిక గాలిపటాల వేడుకలో చూసిన విషాదాన్ని గుర్తు చేసుకుంటారు. ‘ఆ వేడుకలో మాంజాల కారణంగా వందలాది పక్షులు నేలకూలడం నేను ఇంకా మర్చిపోలేదు’అంటారామె.

జనవరిలో గాలిపటాలు ఎగరేసే సమయంలో తమ వద్దకు రోజుకు పదుల సంఖ్యలో గాయపడ్డ పక్షులు వస్తుంటాయని, వాటికి చికిత్స అందించేసరికి ఒక్కోసారి అర్ధరాత్రి కూడా దాటుతుందని వివరిస్తున్నారు. జంతువులు, పక్షులను పెంచగలిగే స్థోమత, సౌకర్యాలు ఉన్నవారే వాటిని పెంచుకోవాలనేది ఆమె ఇచ్చే సలహా. కేవలం అందరిముందూ గొప్పల కోసం వాటిని తీసుకొచ్చి, వాటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదని అంటున్నారు.

అలాగే విదేశీ పక్షులకు వైద్యం అంటూ కొందరు నడిపే నకిలీ కేంద్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలనేది రాణి మాట. పక్షుల వైద్యం అంటే కేవలం పైపైన చూసి మందులివ్వడం కాదని పక్షి శారీరక, మానసిక స్థితులను అర్థం చేసుకొని వైద్యం అందించాలనేది ఆమె సూచన. త్వరలోనే పక్షుల కోసం సీటీ స్కాన్, లేజర్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయాలు సమకూర్చుకుంటారట. దీంతోపాటు కొచ్చిలోనూ ఓ వైద్యకేంద్రం ప్రారంభించాలనే యోచనతో ఉన్నారు ఆ పక్షుల ప్రేమదూత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement