
వివాహేతర సంబంధాలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న హత్యల్లో చాలావరకు సోషల్ మీడియా లింకులు కూడా ఉంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం.. ఈ తరహా నేరాల్లోని మరో కోణాన్ని బయటపెట్టింది.
ఓ ఆంటీ(52) ఇన్‌స్టాగ్రామ్‌కు అడిక్ట్ అయ్యింది. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు చేసేది. ఫిల్టర్‌లను ఉపయోగిస్తూ అమ్మాయిలా ఫోజు ఇస్తూ రీల్స్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె వయసులో సగం ఉన్న ఓ కుర్రాడు.. ఆ రీల్స్‌కు లైకులు, కామెంట్లు పెట్టాడు. మెల్లిగా వ్యవహారం ఇన్‌స్టాగ్రామ్ నుంచి వాట్సాప్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ..
ఉత్తర ప్రదేశ్ మెయిన్‌పురిలో కిందటి నెల 11వ తేదీన గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిస్టరీగా మారిన ఆ కేసును ఎట్టకేలకు చేధించినట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. మృతురాలిని ఫర్రూఖాబాద్ జిల్లా రాణి(52)గా గుర్తించిన పోలీసులు.. ఆమె సోషల్ మీడియా ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.
మెయిన్‌పురికి చెందిన అరుణ్ రాజ్‌పుత్(26).. రాణితో ఏడాదిన్నర కిందట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య చాలాకాలం చాటింగ్, కాల్స్ వ్యవహారం నడిచాయి. అయితే నేరుగా కలిశాక ఆమె తనను మోసం చేసిందని.. తన కంటే వయసులో చాలా పెద్దదని గ్రహించాడు. వదిలించుకునేందుకు చాలా ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆమె అతనికి బోలెడంత డబ్బు(లక్షన్నర రూపాయలకు పైనే) సమర్పించుకుంది.

అరుణ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని.. తన డబ్బుతిరిగి ఇచ్చేయాలని, లేకుంటే తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తన కంటే రెట్టింపు వయసు, పైగా నలుగురు పిల్లలున్న ఆవిడను పెళ్లి చేసుకుంటే ఊళ్లో పరువు పోతుందని అరుణ్ భావించాడు. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఆమెను మెయిన్‌పురికి రప్పించాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. గొంతుకు ఆమె చున్నీనే బిగించి హత్య చేశాడు. కేసులో ఎలాంటి క్లూలు లేకపోవడంతో.. మిస్సింగ్ కేసులతో సరిపోల్చుకున్న పోలీసులు చివరకు కేసును చేధించగలిగారు. పెళ్లి చేసుకోకుంటే పోలీసుల దగ్గరికి వెళ్తుందేమోనని భయపడ్డానని..ఆధారాలు లేకుండా చేసేందుకు ఆమె ఫోన్‌ను దాచేశానని అరుణ్ పోలీసుల వద్ద నేరాన్ని ఒప్పుకున్నాడు.