
= ఘరానా కొడుకు అరెస్టు
కర్ణాటక: ఆస్తి కోసం సొంత కుమారుడే తండ్రిని అశ్లీల చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన జిల్లాలోని మద్దూరులో జరిగింది. వివరాలు.. మద్దూరులో రాణి ఐశ్వర్య డెవలపర్స్ పేరిట హెచ్‌ఎల్ సతీష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను గడించారు. అందులో రూ.6 కోట్ల ఆస్తులను సతీష్ తన కుమారుడు ప్రణామ్ సతీష్ పేరిట రాశారు. అయితే జూదం, సినిమా పిచ్చి పట్టిన కుమారుడు రూ.2 కోట్ల ఆస్తులను నాశనం చేశాడు.
దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి సతీష్ మిగతా ఆస్తులను అమ్మకుండా స్టే తెచ్చాడు. దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న ప్రణామ్ తనకు తెలిసిన వళగెరెహళ్లి గ్రామానికి చెందిన మహేష్ అలియాస్ గుండ, మద్దూరు హళే ఒక్కలిగర వీధి ఈశ్వర్, ఆనెదొడ్డి గ్రామానికి చెందిన ప్రీతమ్‌లతో కలిసి కుట్ర చేశాడు. తండ్రి, ఓ మహిళ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు, సంభాషణలను సేకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధితుడు మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి ప్రణామ్‌తో సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.