సిద్దు సన్నిహితుల్లో అలజడి | - | Sakshi
Sakshi News home page

సిద్దు సన్నిహితుల్లో అలజడి

Dec 5 2025 6:48 AM | Updated on Dec 5 2025 6:48 AM

సిద్ద

సిద్దు సన్నిహితుల్లో అలజడి

శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కుర్చీ కోసం కత్తులు నూరుతూ అల్పాహార భేటీలతో చల్లబడినట్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య సన్నిహితులు అలర్ట్‌ అయ్యారు. దానికి కారణాలు లేకపోలేదు. సిద్దరామయ్యను తప్పిస్తే తమ పని అంతేనని అనుకుంటున్నారు. విరుగుడు సూత్రాల అన్వేషణలో పడ్డారు.

ఆప్తుల డిన్నర్‌ మీటింగ్‌లు

ఇద్దరి బ్రేక్‌ఫాస్ట్‌ భేటీల తరువాత సీఎం సన్నిహిత వర్గానికి చెందిన మంత్రులు వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. రాత్రి వేళ డిన్నర్‌ భేటీలు సైతం సాగుతున్నాయి. ఇటీవల మంత్రులు పరమేశ్వర్‌, సతీశ్‌ జార్కిహొళి మీటింగ్‌ జరిపారు. వీరితో పాటు ఎమ్మెల్సీ బీ.కే.హరిప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

సిద్దరామయ్య మంగళూరు నుంచి బెంగళూరుకు వచ్చాక జార్కిహొళి ఇంట్లో ఆయన, కొందరు మంత్రులు మంతనాలు జరిపారు. మునుముందు ఏమిటనే పరిణామాలపై చర్చ జరిగింది. సీఎం సిద్దరామయ్యను పదవి నుంచి తప్పిస్తే దళిత సీఎం కోటాలో తాము ముందుండాలని పరమేశ్వర్‌, జార్కిహొళి వంటి నాయకులు పట్టుదలతో ఉన్నారు. వీరికి సీఎం సిద్దరామయ్య ప్రోత్సాహం కూడా ఉంది. అలా డీకే శివకుమార్‌కు చెక్‌ పెట్టాలని నిర్ణయించారు.

మహిళా ఉద్యోగులు కోరితే కాదనగలనా?

విధానసౌధ బ్యాంక్వెట్‌ హాల్‌లో గురువారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల సంఘం సమావేశంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పాల్గొన్నారు. సిద్దరామయ్య ప్రసంగంలో జోక్‌లకు ఉద్యోగినులు నవ్వుల్లో తేలిపోయారు.

మీకు గృహలక్ష్మీ సొమ్ము వస్తుందా అని సిద్దరామయ్య ప్రశ్నించినపుడు తాము ప్రభుత్వ ఉద్యోగులమని, రాదని అన్నారు. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారా అని అడగ్గా.. నవ్వుతూనే అవునని అన్నారు. మీకు జీతం అధికంగా వస్తుంది కదా? ఎంత వస్తుంది?, ఆరవ, ఏడవ వేతన కమిషన్‌ను అమలు చేసింది తామేనన్నారు. సెప్టెంబర్‌ 13న మహిళా దినోత్సవంగా ప్రకటించాలని ఉద్యోగినులు కోరగా, మీరు కోరితే కాదనేవారుంటారా? అని సీఎం చమత్కరించారు. ఈ సందర్భంగా సీఎం, డీసీఎంలను వారు సన్మానించారు.

సీఎం కుర్చీ మారితే ఎలా అని గుబులు

ముమ్మరంగా రహస్య భేటీలు

సిద్దరామయ్య సైతం హాజరు

బీజేపీలో సెగలు, ఢిల్లీకి యడ్డి

శివాజీనగర: కాంగ్రెస్‌ మాత్రమే కాకుండా రాష్ట్ర బీజేపీలో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను ఆ పదవి నుంచి తొలగించాలని తిరుగుబాటు నాయకులు ఢిల్లీలో పలువురు అగ్రనేతలను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి యడియూరప్ప దిగారు. తనయుడు విజయేంద్రకు బాసటగా ఆయన ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం పిలిచిందా, లేదా ఆయనే వెళ్లారా అనేది మిస్టరీగా ఉంది. రెబల్స్‌ నాయకులు వరుసగా ఫిర్యాదులు చేస్తూ విజయేంద్రపై అపనమ్మకం పెంచే పనిలో ఉన్నారు. రెబల్‌ నేతలు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి రాధామోహన్‌ దాస్‌ను కలిసి మాట్లాడారు.

63 శాతం కమీషన్ల సర్కారిది

బీజేపీ పక్ష నేత అశోక్‌

యశవంతపుర: కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిండా అవినీతిలోకి కూరుకుపోయిందని బీజేపీ పక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో 63 శాతం కమీషన్ల దందా జరుగుతోందని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి, మా ప్రభుత్వం ఉన్నప్పడు ఇదే కాంగ్రెస్‌ నాయకులు 40 శాతం కమీషన్‌ అని లేనిపోని ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 63 శాతానికి పెరిగాయని ఎద్దేవా చేశారు. అవినీతికి సాక్ష్యాలు ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య అడుగుతున్నారు. ఉప లోకాయుక్త కంటే పెద్ద సాక్ష్యం ఏమి కావాలని అశోక్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇంటి దేవుడే అవినీతి. ఇప్పుడు మీ ముఖాలపై పేటీఎం పోస్టర్‌ను అంటించుకుని తిరగండి అని విమర్శించారు.

సిద్దు సన్నిహితుల్లో అలజడి1
1/2

సిద్దు సన్నిహితుల్లో అలజడి

సిద్దు సన్నిహితుల్లో అలజడి2
2/2

సిద్దు సన్నిహితుల్లో అలజడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement