అక్రమ కాల్స్ ముఠా గుట్టురట్టు
యశవంతపుర: బెంగళూరులో కాల్ సెంటర్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని నాయుడు లేఔట్‌లో ఉంటున్న కాల్ సెంటర్‌లో అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను అక్రమంగా లోకల్ కాల్స్‌గా మార్చి డబ్బు గడిస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు చేశారు. రూ.40 లక్షల విలువగల 28 సిమ్ బాక్స్‌లతో పాటు వివిధ సంస్థలకు చెందిన 1,093 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
షారూక్ పుత్రుని వేలి గొడవ
యశవంతపుర: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ పుత్రుడు ఆర్యన్‌ఖాన్ వివాదంలో చిక్కకున్నారు. అసభ్యంగా మధ్యవేలును చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులో గత నెల 28న రాత్రి ఈ ఘటన జరిగినట్లు వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. జైదుఖాన్, మొహమ్మద్ నలపాడ్‌తో కలిసి ఆర్యన్ బెంగళూరులో ఒక పబ్‌కు వెళ్లారు. పబ్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ మిడిల్ ఫింగర్‌ను చూపి పోజులిచ్చాడని సమాచారం. ఈ సందర్భంగా షారూక్ సినిమాల హిట్ పాటలతో చిందులేశారు.
భార్యను హత్య చేసి
భర్త ఆత్మహత్య
● బెంగళూరులో ఘోరం
బనశంకరి: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు తోడుగా ఉండాల్సిన భర్త.. కిరాతకునిగా మారాడు. ఆమెను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలో సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిక్కగౌడనపాళ్యలో బీఎంటీసీ విశ్రాంత డ్రైవరు వెంకటేశన్ (65), భార్య బేబీ (65) ఉంటున్నారు. బేబీ కొద్దినెలల నుంచి మూర్ఛ వ్యాధితో వీల్‌చైర్ కు పరిమితమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా వీరు ఉద్యోగాలకు బయటకు వెళ్లారు. బుధవారం రాత్రి వృద్ధ దంపతులు మధ్య గొడవ జరిగింది. వెంకటేశన్ బట్టలు ఆరవేసే వైరుతో భార్యకు గొంతు బిగించి హత్యచేశాడు. తరువాత అదే వైరుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇరుగుపొరుగు చూడగా ఇంట్లో మృతదేహలు కనిపించాయి. సుబ్రమణ్యపుర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
పాహిమాం దుర్గాదేవి
మాలూరు: తాలూకాలోని ప్రాచీన దుర్గా దేవి దేవాలయంలో అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష అ భిషేకాలు, పూజలను నిర్వహించారు. అర్చకులు వేణుగోపాల రావ్ ఆధ్వర్యంలో అభిషేకం, పంచామృత అభిషేకం, వేదమంత్ర పారాయణం తదితరాలు జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అఖండ భజన సాగింది.


