
భర్తలను భార్యలు కడతేర్చడం, భార్యలను భర్తలు హతమార్చడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాళ్ల పారాణి ఆరకముందే ఈ తరహా నేరాలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది. అయితే.. వివాహం జరిగి ఐదు నెలలు తిరగకుండానే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కుటుంబం గురించి, ఆ వ్యక్తుల నేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ ఘటనపై..
ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. మధు సింగ్(32) అనే మహిళ వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం నడపడమే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ఆ భర్త అంటుంటే.. లేదు ఆ భర్తే నరకం చూపించి మరీ చంపేశాడని ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భర్త వేధింపుల పర్వం గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది.
సింగపూర్ షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన అనురాగ్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుతో పరిచయం పెంచుకున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. లాంఛనాల కింద రూ.15 లక్షలు అనురాగ్ కుటుంబం డిమాండ్ చేసింది. అయితే మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పాడు. దీంతో అనురాగ్ కాస్త తగ్గి వివాహానికి అంగీకరించాడు. అయితే..
పెళ్లై నెల తిరగకముందే ఆ కట్నం కోసం మధుపై అనురాగ్ వేధింపులకు దిగాడు. ఆమెను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేది లేక ఆ తండ్రి అడిగినంత కట్నం ఇచ్చేశాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లిన అనురాగ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అందరితో సరదాగా ఉండే మధుకు ఆంక్షలు పెట్టాడు. పదే పదే ఆమె ఫోన్‌ను తనిఖీ చేస్తూ వచ్చాడు. దీంతో భర్త లేని టైంలోనే ఆమె ఇంట్లో వాళ్లతోనూ ఫోన్‌లలో మాట్లాడడం ప్రారంభించింది. ఈలోపు.. అకారణంగా మధును అనురాగ్ హింసించడం మొదలుపెట్టాడు.

తనతో కలిసి మందు కొట్టాలని వేధించసాగాడు. చివరకు గర్భం దాల్చిన మధుకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై ఓ అడుగు ముందుకేసి తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. జులై 31వ తేదీన ఓ హోటల్‌లో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు కూడా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అనురాగ్-మధు మధ్య జరిగింది.
అయినా సరే మధు అవన్నీ ఓర్చుకుంది. ఈలోపు.. ఆగస్టు 3వ తేదీన ఇద్దరూ కారులో వెళ్తుండగా గొడవ జరిగింది. వర్షం కారణంగా గుంతలను తప్పించేందుకు ఆమె కారును రోడ్డు పక్కగా తీసుకెళ్లింది. అయితే అనురాగ్ మాత్రం మగవాళ్ల వైపు చూస్తూ నడుపుతోందంటూ కారులోనే మధును చితకబాదాడు. ఈ వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను, మధు వాయిస్ ఆడియో రికార్డింగులను పోలీసులకు సమర్పించారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనురాగ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై వరకట్ననిషేధ చట్టం, బీఎన్‌ఎస్ చట్టాల కింద కేసు నమోదు అయ్యింది. ముందు వెనుక అనురాగ్ గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోకుండా తన కూతురినిచ్చి వివాహం చేసి గొంతుకోశానంటూ ఆ తండ్రి గుండెలు బాదుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తోంది.