
సెహ్రాపూర్: భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు ఒక్కోసారి రోడ్డున పడి అందరి నోళ్లలో నానుతుంటాయి. ఇలాంటి భార్యభర్తల వివాదాల్లో ఇంటి పెద్దలు తలదూర్చినప్పుడు అవి హద్దులు దాటుతుంటాయి. చిన్నపాటి వివాదాలు కూడా విపరీత పరిణామాలకు దారితీస్తుంటాయి. తాజాగా యూపీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుని పోలీస్ స్టేషన్‌కు చేరింది. తమ కుమార్తె సమోసాలు అడిగితే తీసుకురానందుకు అల్లునిపై అత్త దాడి చేసింది.
ఈ ఘటన సెహ్రాపూర్‌లో నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుని తల్లి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెహ్రాపూర్‌కు చెందిన సంగీత తన భర్తను సమోసాలు తీసుకురావాలని అడిగింది. అందుకు అతను నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది
ఈ విషయాన్ని సంగీత తన పుట్టింటివారికి తెలిపింది. వెంటనే సంగీత ఇంటికి చేరుకున్న ఆమె తల్లి.. అల్లునితో మా అమ్మాయి సమోసాలు తీసుకురమ్మంటే.. ఎందుకు తీసుకురాలేదంటూ నిలదీస్తూ దాడి చేసింది. తరువాత అతని భార్య కూడా దాడికి దిగింది. స్థానికులు బాధిత భర్తను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారి ప్రతీక్ దహియా మీడియాకు తెలిపారు.