కాన్పూర్: దేశంలో తరచూ చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం కాన్పూర్ సమీపంలోని అరౌలి ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఢిల్లీ నుండి బిహార్‌లోని సివాన్‌కు వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బస్సు అతివేగంగా సెంట్రల్ డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. పగిలిన గాజు ముక్కలు, చెల్లాచెదురుగా పడిన సామాను, గాయపడిన ప్రయాణికులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమేననే ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు కనిపించాడని సాక్షులు తెలిపారు. కాగా ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ పారిపోయారు. ఈ విషయాన్ని అరౌలి పోలీసు ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ సింగ్ యాదవ్ ధృవీకరించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. బోల్తా పడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆరు అంబులెన్స్‌లలో గాయపడిన వారిని బిల్‌హౌర్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం కాన్పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. డాక్టర్ సంజీవ్ దీక్షిత్, ఏసీపీ మంజయ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రులోని గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బిహార్ ‘ఫలితం’పై వివాదం.. మేనల్లుడు హత్య


