
అధికార కాంగ్రెస్‌కు మద్దతు యోచన
ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం
పరోక్షంగా సంకేతాలిచ్చిన మజ్లిస్ చీఫ్
త్వరలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మజ్లిస్ పార్టీ దూరం పాటించనుందా? అనే ప్రశ్నకు సమాధానం ఔననే వస్తోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘ఎన్నికల్లో స్థానికుడు, సమర్థుడు, ప్రజా సమస్యల పరిష్కరానికి తపించే యువ నేతను ఎన్నుకోవాలి’ అని పిలుపునివ్వడం ఇందుకు బలం చేకూర్చుతోంది. ఏకంగా ఒవైసీ.. బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత పదేళ్లు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి పార్టీ అధికారంలో ఉన్నప్పటికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని.. తాను బాధ్యతాయుతంగా చెబుతున్నానంటూ అనడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి పనులు తీసుకెళ్లినప్పుడు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో కాంగ్రెస్‌కు మజ్లిస్ మద్దతు యోచన ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించినట్లైంది. మరోవైపు బీజేపీ బలోపేతం కాకుండా నిలువరించాల్సి అవసరం ఉందని, మధ్యలో ఓట్లు చీల్చేందుకు కొన్ని కత్తెర పారీ్టలు రావ్చని, ఆలోచించి యువనేతను ఎన్నుకోవాలని సూచించడాన్ని బట్టి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం పాటిస్తున్నట్లు పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. పార్టీ పరంగా అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అధికారపక్షంతో కలిసి నడిచేందుకు..
మజ్లిస్ పార్టీ వ్యూహంలో భాగంగా తాము ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి నడిచే అనవాయితీ ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా తయారైన మజ్లిస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌పై పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్ దోస్తీ కోసం బరిలోకి దిగలేదు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌తో సత్ససంబంధాలు కలిగి ఉండటంతో ఉప ఎన్నికలకు దూరం పాటించాలని భావిస్తోంది.
సెగ్మెంట్‌లో మజ్లిస్ ప్రస్థానం
తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. దీంతో నవీన్ యాదవ్ మజ్లిస్‌కు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సుమారు 18 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన మజ్లిస్ పార్టీ.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్‌ఎస్‌కు సహకరించేందుకు ఆ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అంతా ఊహించినట్లే బీఆర్‌ఎస్‌కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం చేజారగా.. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా ఉప ఎన్నికల్లో దూరం పాటించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.