
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఆమె తండ్రి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును వ్యక్తిగతంగా దూషించిన కేసులో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఐడీఏ బొల్లారం శ్రీరామ్‌నగర్ బస్తీలో నివసించే మజ్జిగ రమేష్ (36) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. బుకింగ్‌లో భాగంగా ఈ నెల 1వ తేదీన క్యాబ్‌లో ప్రయాణికులను తీసుకుని రాజమండ్రి వెళ్లాడు. ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ చూస్తుండగా బోరబండలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులను తట్టుకోలేకనే మృతి చెందినట్లుగా చూశాడు.
దీంతో అదే రోజు రాత్రి గూగుల్‌లో సెర్చ్‌చేసి బాబా ఫసీయుద్దీన్ నెంబర్ సేకరించి ఆయనను తిడదామని ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచి్చంది. వెంటనే గూగుల్‌లో మరోసారి సెర్చ్ చేసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నెంబర్‌ను సేకరించాడు. అదే రోజు రాత్రి మేయర్‌కు ఫోన్ చేసి బోరబండ బీఆర్‌ఎస్ మైనార్టీ నేత సర్దార్ మృతి ఘటనలో దోషులను మీరంతా రక్షిస్తున్నారని,కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మీరంతా ఒక్కటయ్యారని అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ తెల్లవారి రాత్రి కూడా మరోసారి మేయర్‌కు ఫోన్ చేసి ఆమెను, ఆమె తండ్రిని వ్యక్తిగత దూషణలతో వేధించాడు.
మరోమారు ఈ నెల 5వ తేదీన కూడా అర్ధరాత్రి ఫోన్ చేసి ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇలా మూడు సార్లు ఫోన్ చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. దీంతో మేయర్ పీఆర్‌ఓ అఖిల్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ నిందితుడి ఫోన్ నెంబర్‌తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గత మూడు రోజులుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టి శ్రీరామ్‌నగర్‌లోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
నిందితుడు క్యాబ్ నడిపిస్తుంటాడని, సొంతంగా కారు ఉందని, బీఆర్‌ఎస్ అభిమానిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉండగా మేయర్‌కు ఫోన్ చేసిన రోజు రాత్రి నిందితుడు పీకల దాకా మద్యం తాగి ఉన్నట్లు, మద్యం మత్తులోనే ఫోన్లు చేసినట్లుగా నిర్థారణ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.