పదవీ విరమణ అయినా... ప్రయోజనం సున్నా
అంగన్‌వాడీల్లో రెండేళ్ల నుంచి భారీగా రిటైర్మెంట్లు
వయోపరిమితి 65 ఏళ్లు దాటిన వారి తొలగింపు
పదవీ విరమణ పొందిన 6,550 టీచర్లు, హెల్పర్లు
టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు లక్ష రూపాయల చొప్పున బెనిఫిట్..
ఉత్తర్వులు జారీ అయినా సాయం అందని దైన్యం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసిన డి. అహల్య ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందారు. అప్పట్లో పదవీ విరమణ ప్రయోజనాలపై నెలకొన్న సందిగ్ధంతో వాటిని లబి్ధదారులకు ఇవ్వలేదు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్లపై ప్రభుత్వం గతేడాది జూలైలో స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా బెనిఫిట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి ఏమాత్రం స్పందనలేదు. ఏళ్లు గడవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్ తమకు అందుతుందా? లేదా? అని అధికారులను నిత్యం ప్రశ్నిస్తున్నారు.
పెద్దపల్లి టౌన్‌లోని 3వ అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేసిన రసూలాబీ అనే హెల్పర్ అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రితం మరణించింది. అంత్యక్రియల ఖర్చు కింద రూ.20వేల సాయం ప్రభుత్వం అందించాలనే నిబంధన ఉంది. కానీ రసూలాబీ కుటుంబానికి ఇప్పటికీ ఆ సాయం అందలేదు.
చందపల్లి అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌గా పనిచేసిన వేల్పుల స్వప్న ఏడాదిన్నర క్రితం మరణించారు. అంత్యక్రియల ఖర్చు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్వప్న కుటుంబానికి ఇప్పటికీ ఈ సాయం అందలేదు.
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన టీచర్లు, హెల్పర్లు ప్రయోజనాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇతరత్రా కారణాలతో టీచర్ లేదా హెల్పర్ మరణిస్తే ఆ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు కింద ఇచ్చే రూ.20వేల సాయం కూడా అందడంలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు కరుణించడం లేదు.
అంగన్‌వాడీల్లో విధులు నిర్వర్తించినంత కాలం చాలీచాలని వేతనాలతో సర్దుకున్న టీచర్లు, హెల్పర్లకు ఇప్పుడు పదవీ విరమణ ప్రయోజనాల కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్‌వాడీల్లో టీచర్లు, హెల్పర్ల వయసు 65 ఏళ్లు పూర్తయిన వారిని విధుల నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తప్పిస్తోంది. 2024 సంవత్సరం జూన్ నెల నుంచి పదవీ విరమణ ప్రక్రియను పక్కాగా అమలు చేస్తున్నారు. వయసును బట్టి విధుల నుంచి తొలగిస్తున్న అధికారులు వారి ప్రయోజనాల అంశాన్ని పట్టించుకోవడం లేదు.
రెండేళ్లలో 6,550 మంది...
రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 24,942 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 6,655 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో, 4,184 కేంద్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 60వేల మంది టీచర్లు, హెల్ప ర్లు పనిచేస్తున్నారు. 2024 జూన్ నుంచి 2026 మే నెలవరకు దాదాపు 6,550 మంది టీచర్లు, హెల్పర్లు పదవీ విరమణ పొందారు.
వీరిలో కేవలం 287 మంది అంగన్‌వాడీ టీచర్లు, 1,023 మంది అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.7.98 కోట్ల మేర పదవీ విరమణ ప్రయోజనాల నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 5వేల మందికి సంబంధించిన పదవీ విరమణ ప్రయోజనాల జాడలేదు. రిటైర్మెంట్ పొందిన టీచర్లు, హెల్పర్లకు సంబంధించి రూ.30కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం. భారీ మొత్తంలో చెల్లించాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లకు సమానంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల బిల్లులు కూడా నిలిపివేస్తున్నట్లు సంఘాల నేతలు చెబుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో...
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి కొంత కాలం సందిగ్ధం నెలకొంది. గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50వేల చొప్పున చెల్లిస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్లు, హెల్పర్లు సాయాన్ని పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. 2024 జూన్ నుంచి రిటైర్మెంట్లు కొనసాగుతుండగా 2025 జూలైలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రివైజ్డ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున సాయం అందించాలి.
టీచర్/హెల్పర్ మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేలు ఇవ్వాలి. ఈమేరకు ఉత్తర్వుల్లో స్పష్టం చేసినప్పటికీ అమలు పెండింగ్‌లోనే ఉంది. ఈ అంశంపై అంగన్‌వాడీ సంఘాల నాయకులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రితో పాటు కార్యదర్శి, కమిషనర్‌లకు పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం లేదు. కాగా ఈ విషయమై సంబంధిత శాఖకు చెందిన ఓ అధికారిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా త్వరలోనే చెల్లింపులు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
బకాయిలన్నీ ఒకేసారి చెల్లించాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు ధనవంతులు కాదు. నిరుపేదలే చాలామంది ఉన్నారు. నెలవారీగా అత్యంత పరిమితమైన జీతంతో కుటుంబాన్ని పోషిస్తారు. వారి సేవలకు గుర్తింపుగా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు రెండేళ్లుగా నిలిచిపోయాయి. గతంలో ఉత్తర్వుల్లో గందరగోళంతో ఏడాదిపాటు నిలిచిపోగా...ఉత్తర్వులు విడుదలై ఏడాది గడిచినా చెల్లింపులు జరగడం లేదు. ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ ప్రయోజనాలను ఒకేసారి విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతాం. – నల్లా భారతి, రాష్ట్ర అధ్యక్షురాలు, అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్
అధికారుల స్పందన కరువైంది
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. వీటిని విడుదల చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి నుంచి జిల్లా సంక్షేమాధికారి, సంయుక్త సంచాలకులు, డైరెక్టర్, కార్యదర్శితో పాటు మంత్రి వరకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. కలిసినప్పుడు తప్పకుండా విడుదల చేస్తామని చెబుతున్నా ఆ తర్వాత వీటి ఊసెత్తడం లేదు. వచ్చే అరకొర ప్రయోజనాలతో కొంతైనా సాంత్వన వస్తుందనుకుంటే అధికారులు స్పందించకపోవడం బాధాకరం. – మందాల విమల, అంగన్‌వాడీ టీచర్, అప్పన్నపేట


