వీడని యువతి హత్య మిస్టరీ | married woman dies Case Not Resolved | Sakshi
Sakshi News home page

వీడని యువతి హత్య మిస్టరీ

Jan 30 2025 8:55 AM | Updated on Jan 30 2025 8:55 AM

married woman dies Case Not Resolved

 జాడ లేని మృతురాలి కుమారుడు

గంగాధర(చొప్పదండి): మంచిర్యాల జిల్లాలో అదృశ్యమై, కరీంనగర్‌ జిల్లాలో శవమై కనిపించిన యువతి హత్య మిస్టరీ వీడటం లేదు. గంగాధర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గుర్తు తెలియని యువతి హత్య కేసు నమోదవగా మృతురాలి కుటుంబ వివరాలు మంగళవారం సాయంత్రం తెలిశాయి. అయితే, ఆమెను ఎవరు తీసుకెళ్లారు.. ఎక్కడ హత్య చేశారు, ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కుమారుడి జాడ తెలియలేదు. కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండే మమత కాసిపేటకు చెందిన భరత్‌ను ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. 

వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా, మమత నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి మంచిర్యాల వచ్చి, తెలిసినవారి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 25న సాయంత్రం నూనె ప్యాకెట్‌ తీసుకువస్తానని కుమారుడితో కలిసి బయటకు వచ్చింది. ఆమె కారు ఎక్కిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత కరీంనగర్‌–జగిత్యాల ప్రధాన రహదారిలో గంగాధర మండలం కొండన్నపల్లి బస్టాండ్‌ సమీపంలోని మామిడితోట వద్ద రోడ్డు పక్కన మమత శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

మృతురాలి ఫొటోతో అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించారు. మంచిర్యాలలో ఉండే ఆమె కుటుంబసభ్యులు గుర్తించి, మంగళవారం సాయంత్రం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు వారికి అప్పగించారు. మమత హత్యపై, ఆమె కుమారుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతురాలు ఎక్కిన కారు ఎవరిది, అందులో ఉన్నది ఎవరు, ఎటు తీసుకెళ్లారు అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే హత్య మిస్టరీ వీడుతుందని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు.

   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement