Pandu Naroti Death: పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం

Maoist party Is Anger On Government Over Death of Pandu Naroti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్చిరోలికి చెందిన పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రొఫెసర్‌ సాయిబాబా కేసులో అరెస్టయిన ఐదుగురిలో పాండు నరేటి ఒకరని, ఈ నెల 26నే నాగ్‌పూర్‌ జైల్లో పాండు నరేటి మృతిచెందిన వార్తను బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ మంగళవారం ఈ మేరకు లేఖ విడుదల చేశారు. తప్పుడు కేసుకు, శిక్షకు వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు పోరాడుతున్నాయని, ఆరోగ్యం సరిగాలేని పాండు స్వైన్‌ ఫ్లూతో మరణించినట్టు అభయ్‌ తెలిపారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు గానీ, ఆయన తరపు లాయర్‌కు తెలియజేయలేదని ఆరోపించారు. పాండును చికిత్స నిమిత్తం మెరుగైన ఆస్పత్రికి తీసుకెళ్లాలని జైలు అధికారులకు డాక్టర్లు సూచించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పాండు మరణం ప్రభుత్వ హత్య అని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అభయ్‌ స్పష్టంచేశారు. ముంబయి జైల్లో ఉన్న మావోయిస్టు కిరణ్‌ క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నారని, ఆయన భార్య నర్మద ఆరోగ్యం విషమించిందని తెలిసినా కనీసం చూసేందుకు ఆయన్ను తీసుకెళ్లలేదని ఆరోపించారు.

తీరా ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పౌరుల ప్రజాస్వామిక, మౌలిక హక్కులను ప్రభుత్వం హరిస్తోందని, ఈ చర్యలను యావత్‌ ప్రజానీకం ఖండించాలని  పిలుపునిచ్చారు. ఐసీఎస్‌ పీడబ్ల్యూఐ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 13నుంచి 19 వరకు జరగనున్న ఆక్షన్‌ వీక్‌లో ఈ విషయంపై ప్రశ్నించాలని అభయ్‌ కోరారు.
చదవండి: వారిద్దరు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top