సమన్వయలోపం.. ప్రాజెక్టులపై ప్రభావం

30 Projects Of Telangana, Andhra Awaiting Railway Board NOD - Sakshi

రైల్వే–రాష్ట్ర యంత్రాంగం తీరుతో కొత్త టెర్మినళ్లకు ఆటంకం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్ని ప్రాజెక్టులపై ఆ ప్రభావం పడుతోంది. దీన్ని నివారించేందుకు ఏ ప్రయత్నాలు జరగక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్‌లోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ప్రధాన రైల్వే స్టేషన్లలో కేవలం 21 ప్లాట్‌ఫామ్స్‌ ఉండగా ఇవి ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు కూడా సరిపోవట్లేదు. కొత్త రైళ్లు కావాలంటే ప్లాట్‌ఫామ్స్‌ లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం నగర శివారు ప్రాంతాల్లో రెండు భారీ శాటిలైట్‌ టెర్మినళ్లు నిర్మించాలని చాలాకాలంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నిస్తోంది. వరంగల్‌ రూట్‌లో చర్లపల్లి, ముంబై రూట్‌లో నాగులపల్లిని ఎంపిక చేసింది.

చర్లపల్లి స్టేషన్‌ వద్ద రైల్వేకు 50 ఎకరాల భూమి ఉంది. నాగులపల్లిలో స్టేషన్‌ మినహా సొంత భూమి లేదు. దీంతో చర్లపల్లి వైపు 150 ఎకరాలు, నాగులపల్లి వైపు 100 ఎకరాల భూమి ఇస్తే రెండు భారీ టెర్మినళ్లు నిర్మించి నగరానికి రైల్వే పరంగా ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రతిపాదించింది. కానీ వివిధ కారణాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించలేదు. అక్కడితో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. కానీ రైల్వే పరంగా ఇబ్బందులు కొనసాగుతుండటంతో గత్యంతరం లేక తన ఆలోచనను మార్చుకున్న దక్షిణ మధ్య రైల్వే, చర్లపలి వద్ద అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో కొత్త టెర్మినల్‌ నిర్మాణ పని ప్రారంభించింది. నాగులపల్లి ప్రతిపాదన కాస్తా అటకెక్కింది. 

చర్చలేవీ? 
ఈ విషయంలో రైల్వే బోర్డు ఇప్పటివరకు స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భూమిని పొందే ప్రయత్నమే చేయలేదు. ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వకుంటే ఎంతోకొంత ధరకు కొనే విషయాన్ని రైల్వే శాఖ పట్టించుకోవటం లేదు. దీన్ని కొలిక్కి తెచ్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపటం లేదు. ఫలితంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు విఘాతం ఏర్పడింది.  చదవండి: (బడ్జెట్‌ టైమ్: ‌ఆర్థిక భారతానికీ టీకా వేస్తారా?)

చర్లపల్లిలో వేగంగా.. 
చర్లపల్లిలో కొత్త టెర్మినల్‌ పనులను దక్షిణ మధ్య రైల్వే వేగంగా కొనసాగిస్తోంది. గత బడ్జెట్‌లో రూ.4 కోట్లు ఇవ్వటంతో వాటితో పనులు జరుగుతున్నాయి. ఇందుకు రూ.110 కోట్లకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. అక్కడ తక్కువ స్థలమున్నందున కొత్తగా 3 ఫుట్‌ఓవర్‌ వంతెనలు, ఆరు ప్లాట్‌ఫామ్స్, రైళ్లు నిలిపేందుకు పిట్‌ లైన్స్, వాటి నిర్వహణ పనులకు అదనపు మెయింటెనెన్స్‌ లైన్స్‌ నిర్మిస్తోంది. ఈ బడ్జెట్‌లో దీనికి భారీగా కేటాయింపులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఏమిటీ సమస్య? 
సికింద్రాబాద్‌లో కేవలం 10 ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. కానీ నిత్యం ఆ స్టేషన్‌ మీదుగా దాదాపు 250 రైళ్లు (ఎంఎంటీఎస్‌తో కలిపి) వచ్చిపోతుంటాయి. వాటికి ప్లాట్‌ఫామ్స్‌ సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. దీంతో ఇక్కడ ప్లాట్‌ఫామ్‌ ఖాళీ అయ్యేవరకు.. నగరానికి వచ్చిన రైళ్లను శివారులో దాదాపు అరగంట పాటు నిలిపేయాల్సి వస్తోంది. ఇది ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దీంతో చాలామంది అక్కడే దిగి నానా తంటాలు పడి రోడ్డుపైకి చేరుకుని ఆటోలను ఆశ్రయించి వెళ్లిపోవాల్సి వస్తోంది. అలాగే నాంపల్లి స్టేషన్‌కు వంద రైళ్ల తాకిడి ఉండగా ఆరు ప్లాట్‌ఫామ్స్‌ మాత్రమే ఉన్నాయి.  చదవండి: (స్కూల్‌ బెల్‌ నేటి నుంచే..)

ఇందులో మూడు చిన్నవి కావటంతో ఎక్కువ బోగీలుండే రైళ్లకు పనికిరావటం లేదు. మూడు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కాచిగూడ స్టేషన్‌ మీదుగా 150 రైళ్లు సాగుతుండగా, ఐదు ప్లాట్‌ఫామ్స్‌ మాత్రమే ఉన్నాయి. కొత్తగా రైళ్లు కేటాయిస్తే వాటిని నిలిపేందుకు జాగా లేకుండా పోయింది. ఖాళీ సమయాల్లో రైళ్లను పార్క్‌ చేసేందుకు స్థలం లేక దూరంగా ఉన్న స్టేషన్లలో నిలిపి తిరిగి తీసుకురావాల్సి వస్తోంది. అయితే ఖర్చును పంచుకునే పద్ధతిలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో రైల్వే–రాష్ట్ర ప్రభుత్వం మధ్య సఖ్యత లేక పనుల్లో జాప్యం జరుగుతున్నట్టుగానే ఈ టెర్మినల్‌ ప్రాజెక్టుల విషయంలోనూ సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించేందుకు ఇరువైపులా చొరవ చూపాల్సి ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top