కేంద్ర బడ్జెట్‌పై బోలెడు ఆశలు

Telangana Holding Its Breath, Will Union Budget Meet Its Hopes? - Sakshi

కరోనా వేళ ఊరట కోసం రాష్ట్రం ఎదురుచూపు

సెస్‌ల తగ్గింపు, పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లింపు తదితరాలు కోరుతూ ఇటీవల లేఖ

విజ్ఞప్తులు ఏ మేరకు నెరవేరుతాయోనని ఉత్కంఠ

కేంద్రం స్పందనపైనే రాష్ట్ర పద్దు లెక్క ఆధారపడిందంటున్న అధికార వర్గాలు 

ఒక్క నెల జీతం ఆగితేనే ఆరిపోయే బతుకులు!!  మరి ఏడాది పాటు జీవితాలే ఆగిపోతే!!?  ఊహలకే అందని ఈ విలయాన్ని... కోవిడ్‌ నిజం చేసింది. వేల మంది ప్రాణాలు పోయాయి. కోట్ల మంది జీవచ్ఛవాలయ్యారు. కుటుంబపెద్దలు పోయి... కుటుంబాలు వీధినపడ్డాయి. ఆర్థిక రథ చక్రాలు తునాతునకలైపోయాయి. మళ్లీ ఇవి గాడినపడేదెప్పుడు? ఆర్థిక మంత్రి ఈ రోజున ప్రవేశపెట్టే బడ్జెట్‌... 

గతేడాది గాయాలకు ఎలాంటి మందు వేస్తుంది? 
కోవిడ్‌ కొందరి సంపద పెంచి ఉండొచ్చు. అంబానీ, అదానీ లక్షల కోట్లకు ఎగబాకి ఉండొచ్చు. కానీ కోట్ల మంది అత్యంత విషాదకరమైన ఆర్థిక విష వలయాన్ని చూశారు. స్కూళ్లు మూసేయటంతో.. పాఠాలు చెప్పే టీచర్లు... ఆయాలు... అద్దెలు కట్టలేని చిన్నచిన్న యాజమాన్యాలు... పిల్లల్ని తీసుకెళ్లే ఆటోడ్రైవర్లు... ఈ వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. హోటళ్లు,  రెస్టారెంట్లలో వండి వడ్డించేవారికి తిండిలేదు. థియేటర్లలో సినిమా చూపించేవారు నిజమైన హర్రర్‌ ఫిల్మ్‌ చూశారు. చిన్నచిన్న కంపెనీలు, మాల్స్, షాపులు, క్యాబ్‌లు, సెలూన్లు... వీటి చుట్టూ అల్లుకున్న చిరు ఆర్థిక వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయి. చదవండి: (స్కూల్‌ బెల్‌ నేటి నుంచే..)

కూలీలు, తోపుడు బళ్లు, ఇంటిపని వాళ్లే కాదు... పడుపు వృత్తిలో ఉన్నవారు సైతం స్వచ్ఛంద సంస్థల దానధర్మాలపై ఆధారపడక తప్పలేదు.  కోట్ల మందికి పిడికెడు బియ్యం కూడా పుట్టని ఈ మహా విలయాన్ని ఇవ్వాళ ప్రవేశపెట్టే ఒక్క.. బడ్జెట్టూ ఏ మేరకు సరిచేయగలదు? ఇవేమీ ఒక్కరోజులో మానిపోయే గాయాలు కాదు. కానీ మందు వేయటం తప్పనిసరి. కాస్త త్వరగా తగ్గే మందు వేయాలి. లోపల గాయం ఇంకొన్నేళ్లు పచ్చిగానే ఉండొచ్చు. నొప్పి  బాధయినా ఉపశమించాలి కదా? అందరి ఆశా అదే... అందరి చూపూ ఆర్థిక మంత్రి వైపే!!. 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2021–22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు నేరుగా లబ్ధి కలిగేలా కేంద్ర బడ్జెట్‌ ఉండాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా తమ విజ్ఞప్తులను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగు ణంగా రాష్ట్రాలకు స్పెషల్‌ గ్రాంటుల మంజూరు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, రుణాలు సమకూర్చుకునే విషయంలో కొం త సరళంగా ఉండాలని కోరుతున్న రాష్ట్రం... ‘తెలుగింటి కోడలు’ ఈసారి ప్రవేశపెట్టే పద్దులో ఆ విజ్ఞప్తులు ఎంత మేరకు నెరవేరుతాయోననే ఉత్కంఠతో ఉంది.

పింఛన్‌ సాయం పెంపు, కేంద్ర ప్రాయోజిత పథ కాల (సీసీఎస్‌) అమ లులో రాష్ట్రాలకు స్వేచ్ఛ, కేంద్రం విధించే సెస్‌ల తగ్గింపు, జీఎస్టీ పరిహారం పూర్తి స్థాయిలో చెల్లింపు లాంటి అంశాలు కరోనా కష్టకాలంలో ఊరట కలిగిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని అంశాలపై తమ ప్రతిపాదనలను వివరిస్తూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిర్మలా సీతారామన్‌కు ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలపై కేంద్ర బడ్జెట్‌లో స్పందన ఎలా ఉంటుందన్న దానిపైనే వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ లెక్క ఆధారపడి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

►ఆర్థిక సంఘాలు చేసే సిఫారసుల ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చే ఆనవాయితీ చాలా కాలంగా వస్తోంది. కానీ 2020–21 బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ఈ ఆనవాయితీని పక్కన పెట్టింది. దీంతో కేంద్ర పన్నుల వాటాల్లో తగ్గుదలను భర్తీ చేసేందుకు దేశంలోని మూడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు స్పెషల్‌ గ్రాంట్లు ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు అమలు కాలేదు. ఈ కారణంగా రాష్ట్రానికి రూ. 723 కోట్ల నిధులు రాలేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసును పరిగణనలోకి తీసుకుని వెంటనే ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. ఆర్థిక సంఘం పరిమితి ముగిసే వరకు ఈ ఆనవాయితీని కొనసాగించాలి.

లేఖలో హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తులు
►సెస్‌లు, సర్‌చార్జీల రూపంలో కేంద్రం వివిధ వినియోగ వస్తువులపై విధిస్తున్న పన్నులను కేంద్ర పన్నుల వాటాలో కలపడం లేదు. దీంతో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గిపోతోంది. సెస్, సర్‌చార్జీలు విధిస్తున్న వాటిలో ఎక్కువగా రాష్ట్రాల జాబితాలోవే ఉన్నాయి. దీంతో రాష్ట్రాలకు ఉన్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి తగ్గిపోతోంది. ఈ ఏడాది నుంచి అయినా సెస్‌లు, సర్‌చార్జీలను రాష్ట్రాలకు వాటా కల్పించే పన్ను మొత్తంలో కలపడానికి కేంద్రం శ్రీకారం చుట్టాలి. 

►కరోనా కష్టకాలంలో రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కలిగేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు అనుమతించే మొత్తంతోపాటు జీఎస్‌డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునే అవకాశాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలి.

►ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్‌ 94 (2) ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. దీని ప్రకారం ఏటా రాష్ట్రానికి రూ. 450 కోట్లు రావాలి. 2019–20, 2020–21 సంవత్సరాలకు జిల్లాల వారీగా ఇచ్చే ఈ నిధులు కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదు. వాటిని వెంటనే మంజూరు చేయడంతోపాటు రానున్న ఐదేళ్ల పాటు కూడా ఈ సాయాన్ని కొనసాగించాలి.

►స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు వర్తింపజేస్తామని 2020–21 బడ్జెట్‌లోనే చెప్పినా ఇప్పటికీ 50 శాతం జిల్లాలకే వర్తింపజేస్తున్నారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు ఇప్పటికైనా అమలు చేయాలి. 

►జీఎస్టీ పరిహారాన్ని ఎలాంటి నిబంధనలూ లేకుండా రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. కేంద్ర పన్నుల్లో వాటాఏటా పెరిగేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టాలి.

►జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ) కింద పింఛన్‌ కోసం నెలకు రూ. 200 మాత్రమే ఇస్తున్నారు. పేదల అవసరాలు తీర్చేందుకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ఈ బడ్జెట్‌ నుంచి అయినా దీన్ని రూ. 1,000కి పెంచాలి. 

►కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలని కేంద్రం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘం 2016లోనే నిర్ణయించింది. దీని ప్రకారం కేంద్ర పథకాల కింద వచ్చే నిధులను రాష్ట్రం అమలు చేసే ఇతర సంక్షేమ పథకాలకు మరల్చుకునే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇవ్వాలి. కానీ ఇది అమలు కావడం లేదు. ఈ బడ్జెట్‌లో అయినా ఆ ప్రతిపాదనకు మోక్షం కలిగించాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top