
ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు
ఉరేసుకొని యువకుడు..
అక్కడే పడి ఉన్న మహిళ మృతదేహం
గజసింగవరంలో ఘటన
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడే ఓ మహిళ మృతదేహం పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గజసింగవరం గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్(27) తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఇంట్లో చెరుకూరి రేఖ(25) అనే వివాహిత మృతదేహం పడి ఉంది. ఆమె శరీరంపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్‌కు వివాహం కాగా.. భార్య గురువారం పుట్టింటికి వెళ్లింది. రేఖ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై ప్రేమానంద్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.