సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే | Mallikarjuna Kharge with leaders aspiring for ministerial posts | Sakshi
Sakshi News home page

సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే

Jul 4 2025 1:26 AM | Updated on Jul 4 2025 1:26 AM

Mallikarjuna Kharge with leaders aspiring for ministerial posts

గురువారం శంషాబాద్‌ విమానాశ్రయంలో మల్లికార్జున ఖర్గేకు స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

అన్ని సామాజిక వర్గాలు, జిల్లాలకు భవిష్యత్తులో సముచిత న్యాయం 

అనుభవం, అర్హతలకనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తాం  

రెండోసారీ అధికారంలోకి వస్తాం.. అప్పుడూ అవకాశాలు వస్తాయి 

సీనియారిటీకి గౌరవం తప్పకుండా ఉంటుంది.. 

‘స్థానిక’ ఎన్నికలపై దృష్టి పెట్టండి.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి 

తాజ్‌ కృష్ణా హోటల్లో ముఖాముఖిగా మాట్లాడి బుజ్జగింపు 

ఎవరి వాదనలు వారివే.. అలిగి వెళ్లిపోయిన ప్రేంసాగర్‌రావు! 

దాదాపు 3 గంటల పాటు హోటల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి 

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఖర్గేకు ముఖ్య నేతల స్వాగతం  

నేడు పలు సమావేశాలు, బహిరంగ సభలో పాల్గొననున్న ఏఐసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్‌ కృష్ణా హోటల్‌కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్‌ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. 

మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే 
ఏఐసీసీ చీఫ్‌తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్‌రెడ్డి, ప్రేంసాగర్‌ రావు, బాలునాయక్, రామ్మోహన్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్‌కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఆది శ్రీనివాస్‌కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. 

కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  

కష్టపడండి ..గెలిచి రండి 
అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.  

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు 
ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 

9 దాటిన తర్వాత హోటల్‌ నుంచి రేవంత్‌ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌ హోటల్‌కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. 

చీఫ్‌ విప్‌ ఆఫర్‌ చేసినా.. 
తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు హోటల్‌ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్‌ విప్‌ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. 

కాగా ప్రేంసాగర్‌ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్‌ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ  అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. 

కొండా మురళి దంపతుల వివరణ 
వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్‌ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. 

ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. 
ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్‌ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు.  

నేడు వరస సమావేశాలు 
మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement