
ఓబీసీ జాతీయ మహాసభలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
బీసీలు కోరుకున్న కులగణనను మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతోంది
12 తీర్మానాలకు మహాసభ ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన గురువారం గోవా యూనివర్సిటీ సమీపంలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగిన 10వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలు కోరుకున్న కులగణన ప్రక్రియను మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతోందన్నారు.
వచ్చే ఏడాదిలో జరిగే జనగణనలో కులగణనను జోడించిందని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీలకు మేలు చేసే ఉద్దేశంతో కేబినెట్‌లో 27 మంది బీసీలకు అవకాశం కలి్పంచారన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ మహాసభల ద్వారా బీసీల ఐక్యత పెరుగుతుందని.. డిమాండ్లు సాధించుకొనే అవకాశం లభిస్తుందన్నారు. తన మంత్రివర్గంలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. గోవా కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాకూర్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు తేల్చి జనాభా ఆధారంగా బీసీలకు వాటా అందించాలన్నారు. సదస్సుకు విశిష్ట అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారం అహిర్ హాజరయ్యారు.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయాలి: జాజుల
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం చేసిన కులగణన ప్రక టన 100% బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామన్నారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ ప్రకారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.