
హైదరాబాదీ నవాబ్‌ను మోసం చేసిన కాశ్మీరీలు
రూ.3 కోట్లు తీసుకుని నకిలీది అంటగట్టిన వైనం
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన జమ్మూ పోలీసులు
రూ.65 లక్షలు రికవరీ.. ఆస్తుల స్వాధీనానికి సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: కాశ్మీర్‌లోని కుస్తావ్ జిల్లాలోని పాడ్డర్ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాల్లో దొరికే నీలమణికి ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కాశ్మీరీలు హైదరాబాద్‌కు చెందిన నవాబ్ మీర్ ఫిరాసత్ అలీ ఖాన్‌కు రూ.3 కోట్ల మేర టోకరా వేశారు. గత ఏడాది జరిగిన ఈ మోసంపై ఆయన జమ్మూలోని బహుఫోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని కోర్టు ద్వారా బుధవారం నవాబ్ మీర్ ఫిరాసత్‌కు అందించారు.
అలీ ఖాన్‌కు విలువైన మణులు, రత్నాలు సేకరణ హాబీగా ఉంది. దీనికోసం ఆయన దేశ విదేశాలకు చెందిన వ్యాపారులను సంప్రదిస్తుంటారు. ఈ విషయం తెలిసిన జమ్మూలోని రాజౌరికి చెందిన మహ్మద్ రాయజ్, పూంచ్ వాసి మహ్మద్ తాజ్ ఖాన్ పథకం ప్రకారం ఫిరాసత్‌ను సంప్రదించారు. పలుమార్లు హైదరాబాద్ వచ్చిన వెళ్లిన వారు తమ వద్ద విలువైన నీలమణి, అలాంటి మణులతో చేసిన ఆభరణా లు ఉన్నాయంటూ నమ్మబలికారు. తొలుత ఓ మణి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన ఫిరాసత్ రూ.3 కోట్లు చెల్లించారు. అతడిని గత ఏడాది నవంబర్‌లో రాజౌరీకి పిలిపించిన వారు నకిలీ మణి అప్పగించారు.
మరికొన్ని ఆభరణాల విక్రయం కోసం రూ.25 కోట్లకు బేరసారాలు చేశారు. ఆ ద్వయం అందించిన నీలమణిని పరీక్షించిన ఫిరాసత్ నకిలీదని గుర్తించారు. దీనిపై జమ్మూలోని బహు ఫోర్ట్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉన్న ఈ ద్వయం గత వారం చిక్కింది. వీరి నుంచి రూ.65 లక్షల నగదు స్వా«దీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో ఆ మొత్తాన్ని బాధితుడికి చేర్చారు. నిందితుల నుంచి పోలీసులు మరికొన్ని నకిలీ నీలమణులు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిరాసత్ నుంచి కాజేసిన మొత్తం వెచ్చించి వారు నిందితులు జమ్మూ, కాశ్మీర్‌లో ఆస్తులు ఖరీదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్‌ఎస్‌ఎస్) 107 సెక్షన్ ప్రకారం ఇలాంటి ఆస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంది. దీంతో ఆ కోణంలో చర్యలు తీసుకుంటున్నారు.