ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై కోదాడ యువకుడికి చోటు
ఆసియాలోనే వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్‌గా అతడు రూపొందించిన లోకల్ యాప్
స్వయంకృషి, పట్టుదలతో కోదాడ పట్టణానికి చెందిన జానీ పాష ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు సంపాదించాడు. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 100 స్టార్టప్ కంపెనీలలో జానీ పాష స్థాపించిన ‘లోకల్ యాప్’ చేరింది. దీంతో ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ అక్టోబర్ సంచిక కవర్ పేజీపై జానీ పాష ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జానీపాష అరుదైన ఈ గౌరవాన్ని పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా: కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యాకుబ్ పాష కుమారుడైన జానీ పాష 10వ తరగతి వరకు కోదాడలోనే చదువుకున్నారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ 2018లో ‘లోకల్’ పేరుతో తన మిత్రుడు విపుల్ చౌదరితో కలిసి యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను జానీ పాష కోదాడలోనే లాంచ్ చేశారు. దీనిలో తెలుగు, కన్నడ భాషలలో లోకల్ సమాచారాన్ని అప్పటికప్పుడు అందించే విధంగా తయారు చేశారు.
గడిచిన ఏడు సంవత్సరాల్లోనే ఈ యాప్ రూ.238 కోట్ల పెట్టుబడులను సమీకరించి ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీగా నిలిచింది. దీంతో ప్రతిష్టాత్మకమైన బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ ఇండియా అక్టోబర్ నెలలో “100 టు వాచ్’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. అందులో జానీపాషతో పాటు మరికొందరు స్టార్టప్ ఫౌండర్ల ఫొటోలను ప్రచురించింది. ఈ మ్యాగజైన్‌లో వారు విజయాన్ని ఎలా అందుకున్నారనే అంశాలతో ఇంటర్వూ్యలను ప్రచురించింది.
, Johnny Pasha,


