కర్రెగుట్టల్లో రయ్‌.. రయ్‌ | Latest development work begins in Karreguttalu | Sakshi
Sakshi News home page

కర్రెగుట్టల్లో రయ్‌.. రయ్‌

Apr 24 2026 3:24 AM | Updated on Apr 24 2026 3:24 AM

Latest development work begins in Karreguttalu

ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌తో ‘తారు’మారైన పరిస్థితి 

ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోట 

తాజాగా అభివృద్ధి పనులకు శ్రీకారం 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రెండేళ్ల క్రితం వరకూ మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయి. అయితే ఈ రెండు జిల్లాల సరిహద్దులో విస్తరించిన కర్రె గుట్టల వద్ద చేపట్టిన ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మావోయిస్టులు పూర్తి ఆత్మరక్షణలోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. అయితే, భవిష్యత్‌లోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కర్రె గుట్టల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో  
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్న కర్రె గుట్టలే కేంద్రంగా మావోయిస్టులు ఆయుధ తయారీ కేంద్రం, ఆయుధ నిల్వాగారం, ఆస్పత్రి, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్‌ కగార్‌ పతాక స్థాయికి చేరాక గాయపడిన కేడర్‌ నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వరకు ఇక్కడి రక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో మావోయిస్టులను తుదుమట్టించే లక్ష్యంతో గతేడాది ఏప్రిల్‌ 21న 5వేల మందికి పైగా బలగాలు, మూడు హెలికాప్టర్లతో కర్రెగుట్టల గాలింపు చర్యలను ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ పేరిట కేంద్రం చేపట్టింది. 

21 రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోగా, ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మరో 700 మంది మావోలు ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లక తప్పలేదు. ఆపై శిక్షణ కేంద్రాలు, ఆయుధ నిల్వలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. 

క్యాంపులతో కట్టడి 
ఎత్తయిన కొండలు, ఎక్కడిక్కడ జలపాతాలు, లోయలు వంటి సహజ వనరులు కర్రె గుట్టల ప్రాంతంలో మెండు. ఇక్కడ జనసంచారం తక్కువ కావడంతో ఈ గుట్టలను సైనిక దుర్గంగా మావోయిస్టులు మార్చుకున్నారు. ఐదు వేల అడుగుల ఎత్తులో 50 కి.మీ పొడవు, 15 కి.మీ వెడల్పుతో రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ గుట్టలను ఖాళీగా వదిలేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి. దీంతో ఏడాది కాలంగా కర్రె గుట్టల చుట్టూ తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ వైపు కొత్త క్యాంపుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారు.  

జనసంచారం పెంచేలా 
భౌగోళికంగా కర్రె గుట్టలకు తెలంగాణ వైపు ములుగు జిల్లా, ఛత్తీస్‌గఢ్‌ వైపు బీజాపూర్‌ జిల్లా ఉంటుంది. ఈ రెండు జిల్లాల మధ్య ఎత్తయిన కర్రె గుట్టలు ఉండడంతో బీజాపూర్‌ జిల్లాలోని పూజారి కాంకేర్, గుంజపర్తి, పెద్ద ఊట్ల, కస్తూరిపాడు తదితర గ్రామాల ప్రజలు దూరమైనా, తమ అవసరాల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అందుకే ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల కంటే కూడా చర్లపై మావోయిస్టులు ఎక్కువ ప్రభావం చూపించగలిగారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జన సంచారం పెంచే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. 

32 కి.మీ రోడ్డు 
బీజాపూర్‌ జిల్లాలోని నంబీ నుంచి తెలంగాణలోని వాజేడు మండలం మురుమూరు వరకు కర్రె గుట్టల మీదుగా 32 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే మురుమూరు నుంచి పామునూరు వరకు 14 కి.మీ మేరకు ఘాట్‌లో మట్టి రోడ్డు నిర్మించారు. వేసవి ముగిసేలోగా దీన్ని తారు రోడ్డుగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా వాజేడు వైపు నుంచి కర్రె గుట్టల మీదకు సులువుగా వాహనాల్లో చేరుకోవడం సాధ్యమవుతుంది. 

వానాకాలం ముగిశాక పామునూరు నుంచి కర్రె గుట్టల మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వైపు దిగుతూ నంబి–పూజారికాంకేర్‌ రోడ్డును తాకేలా మరో 18 కి.మీ రోడ్డు అందుబాటులోకి తెస్తారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఎకో టూరిజం అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఉంది. కర్రె గుట్టల్లో రోడ్డు నిర్మాణం జరిగితే చర్ల, దుమ్ముగూడెం మండలాలు పూర్తి స్థాయిలో మావోయిస్టు ప్రభావం నుంచి బయటపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement