కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కేటీఆర్‌ లేఖ

KTR Writes Letter To Union Minister Smriti Irani - Sakshi

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు రూ.1,094 కోట్లు అవసరం

సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయండి

తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ నెలకొల్పండి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు 2021–22 కేంద్ర బడ్జెట్‌లో నిధుల విడుదలతో పాటు సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ, టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్‌ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన నిధులతో పాటు, కోవిడ్‌ సంక్షోభంలో ఈ రంగాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. రూ.1,552 కోట్ల అంచనాతో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో కీలకమైన మౌలిక వసతుల కోసం సుమారు రూ.1,094 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. 

రూ.300 కోట్లు ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ స్కీం కింద రూ.500 కోట్ల మేర విడుదలకు అవకాశమున్నందున బహిర్గత మౌలిక వసతుల కోసం తక్షణమే కనీసం రూ.300 కోట్లు ఇవ్వాలని కేటీఆర్‌ లేఖలో కోరారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీఎస్‌డీఎస్‌) మార్గదర్శకాల ప్రకారం 25,495 మరమగ్గాలు (తెలంగాణలో 35,588) ఉన్న సిరిసిల్లలో ఇచల్‌కరంజి (మహారాష్ట్ర), సూరత్‌ (గుజరాత్‌) తరహాలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులను ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు రూ.50 కోట్లతో వీవింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆలస్యమవుతున్నందున ‘మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌’తో పాటు రూ.49.84 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ నిధులతో సిరిసిల్లలోని వీవింగ్‌ అపారెల్‌ పార్క్, టెక్స్‌టైల్‌ పార్కులో మౌలిక వసతులు, మగ్గాల ఆధునీకరణ, మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి తదితరాలు చేపడతామన్నారు. 

తెలంగాణలో ఐఐటీహెచ్‌ ఏర్పాటు
పవర్‌లూమ్‌ రంగానికి సంబంధించి మార్కెటింగ్‌ వ్యూహాల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ‘పవర్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’కు ప్రభుత్వ వాటాగా రూ.756.97 కోట్లు సమకూరుస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేస్తోందన్నారు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు తమిళనాడు, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ఏర్పాటు చేయాలని కోరారు. పూర్తి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత పార్కులో సదుపాయాలు ఉన్నాయన్నారు. జాతీయ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎన్‌హెచ్‌డీపీ) కింద బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్లు మంజూరు చేసి పవర్‌లూమ్‌ ఆధునీకరణకు సహకరించాలని లేఖలో కోరారు.

చేనేత, వస్త్ర రంగంలో పెట్టుబడులు
భారతీయ చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమపై కోవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని ప్రస్తావిస్తూ విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో లావాదేవీలు స్తంభించి లక్షలాదిమంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాత్కాలిక విధానం(షార్ట్‌ టర్మ్‌ పాలసీ) రూపొందించి, వేతనాలు, బ్యాంకింగ్, ఎగుమతులకు ప్రోత్సాహకాలు, జీఎస్‌టీ చెల్లింపులు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ను విస్తృతం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ ఈ కామర్స్‌ వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. చేనేత, వస్త్ర రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రానికి కేటీఆర్‌ సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top