
కాంగ్రెస్ పాలనలో అంతటా అవినీతి, అక్రమాలే
20 నెలల్లో విషాహారంతో అనేకమంది విద్యార్థులు మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కేటీఆర్ మండిపాటు
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు కల్పిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు నారా చంద్రబాబునాయుడికి, నిధులు రాహుల్‌గాంధీకి, నియామకాలు చంద్రబాబు తొత్తులకు ఇస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగి ప్రజాధనం లూటీ అవుతోందని ఆరోపించారు. కేటీఆర్ ఆదివారం హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు.
గిప్ట్ ఏ స్మైల్ కింద పరకాలలో ‘పోచంపల్లి పౌండేషన్’ఆధ్వర్యంలో మహిళలకు కేసీఆర్ కిట్లు, కుట్టు మెషీన్లు పంపిణీ చేశారు. అనంతరం పరకాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సదస్సులో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లో 111 మంది గురుకుల విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అయినట్టు తెలిసిందని ఆందోళన వ్యక్తంచేశారు.
20 నెలల కాంగ్రెస్ పాలనలో పదుల సంఖ్యలో విద్యార్థులు మరణిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. మీ పిల్లలకు ఇలాంటి విషాహారమే పెడతారా? అని ప్రశ్నించారు. అందాల పోటీలకు వచ్చిన ప్రపంచ సుందరీమణులు, వారిని చూసి సొంగకార్చే వారి కోసం ఒక్కో భోజనానికి రూ.లక్ష చెల్లించిన ఈ ప్రభుత్వం.. విద్యార్థులకు రూ.150 వెచ్చించలేదా? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం కుట్ర వెనుక కాంగ్రెస్ ఉందేమో..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఫియర్‌లు కుంగడానికి కాంగ్రెస్ నేతలే కుట్రచేశారా? అన్న అనుమానం కలుగుతోందని కేటీఆర్ అన్నారు. టెక్స్‌టైల్ పార్కులో రూ.137 కోట్ల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో రూ.297 కోట్లకు పెరిగాయని ఆరోపించారు. కాల్వ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.167 కోట్లు దోచుకోవాలనుకున్నారని ధ్వజమెత్తారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల బాకీ ఉందని కేటీఆర్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఆడబిడ్డలు కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే చూస్తున్నానని దుయ్యబట్టారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఉన్నారు.