రూ.500 కోట్లివ్వండి  

KTR Requests Nitin Gadkari To Sanction Additional Funds For Telangana - Sakshi

హైదరాబాద్‌–విజయవాడ ఎన్‌హెచ్‌ అభివృద్ధికి చర్యలు 

హైదరాబాద్‌ నగర పరిధిలో 25 కి.మీ. మేర ఉన్న రహదారి 

అదనపు నిధుల మంజూరు కోసం గడ్కరీకి మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధికి రూ.500 కోట్ల అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు గురువారం లేఖ రాశారు. హైదరాబాద్‌కు అత్యంత కీలకమైన ఈ రహదారి మహానగర పరిధిలో 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందన్నారు. ఈ రహదారిపై నగర పరిధిలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో హై లెవల్‌ జంక్షన్లు, సర్వీసు రోడ్డు వంటి సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. లేన్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.500 కోట్లతో డిటైల్డ్‌ ప్లానింగ్‌ రిపోర్టును తయారు చేసిందని వెల్లడించారు.  

నగర విస్తరణకు అనుగుణంగా వసతులు.. 
హైదరాబాద్‌ విస్తరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని మంత్రి కేటీఆర్‌.. గడ్కరీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కేంద్రం నుంచి మంజూరైన నాలుగు అర్బన్‌ ప్రాజెక్టులకు సంబంధించి మూడింటి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులకు భూ సేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్‌ వంటి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. ఐటీ రంగంలో అగ్రగామి సంస్థలతో పాటు ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగాల్లో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు వస్తున్నాయన్నా రు. హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ ప్రాజెక్టుతో పాటు ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంలో భాగంగా ఫ్లై ఓవర్లు, రైల్వే అండర్‌ బ్రిడ్జి, ఓవర్‌ బ్రిడ్జీలు పూర్తి చేయడంతో పాటు లింకు రోడ్లను నిర్మించామన్నారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అదనపు నిధులు కేటాయించడం ద్వారా మద్దతు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top