భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పెట్టుబడులు

KTR Inaugurates Knight Frank India New Office In Hyderabad - Sakshi

దేశ నూతన టెక్‌హబ్‌గా తెలంగాణ

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా కార్యాలయం ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న అవకాశాల దృష్ట్యా భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణకు వస్తారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆరేళ్లలో భారతదేశానికి హైదరాబాద్‌ నూతన టెక్‌హబ్‌గా మారిందని, ఐటీ కార్యకలాపాల తీరుతెన్నులు కూడా మారిపోయాయని చెప్పారు. హైదరాబాద్‌ ప్రీమియర్‌ ఐటీ హబ్‌లోని నాలెడ్జ్‌ సిటీ డల్లాస్‌ సెంటర్‌లో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నూతన కార్యాలయాన్ని కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. నగరంలో ఇటీవల మౌలిక వసతులు గణనీయంగా వృద్ధి చెందాయని అన్నారు. కరోనా వల్ల అనిశ్చితి ఏర్పడినా ఐటీ రంగ కార్యకలాపాలతో ముడిపడిన హైదరాబాద్‌లో రెసిడెన్షియల్‌ మార్కెటింగ్‌కు డిమాండ్‌ కొనసాగుతోందని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, డేటా సెంటర్స్, వేర్‌ హౌసెస్‌ రంగాలు ఊపందుకుంటున్నాయని చెప్పారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌ దేశంలోనే ముఖ్యమైన బిజినెస్‌ హబ్‌గా అవతరించిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌ శిశిర్‌ బైజల్‌ అన్నారు. ఐటీ రంగంతోపాటు ఇతర రంగాల ఆర్థిక వ్యవస్థలకు హైదరాబాద్‌ ఆధునిక బిజినెస్‌ క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటోందని నైట్‌ ఫ్రాంక్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ శాంసన్‌ ఆర్థర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో కలసి ఫ్లాగ్‌షిప్‌ అధ్యయన నివేదిక ‘డబ్ల్యూఎఫ్‌హెచ్‌– వర్క్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌’ నివేదికను కేటీఆర్‌   ఆవిష్కరించారు. 

డబ్ల్యూఎఫ్‌హెచ్‌ నివేదికలోని ముఖ్యాంశాలు
హైదరాబాద్‌ వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2014–2019 మధ్యకాలంలో లావాదేవీలపరంగా 172 శాతం వృద్ధిరేటు సాధించింది. వాణిజ్య మార్కెట్‌పరంగా 2020 మూడో త్రైమాసికానికి 2 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది. పదేళ్లలో నివాసధరలు 5.3 శాతం వృద్ధిరేటుతో పెరుగుతూ కోవిడ్‌ సమయంలోనూ అద్దెలు స్థిరంగా ఉన్నాయి. అనిశ్చిత మార్కెట్, అమ్మకాలు తక్కువగా ఉన్నా నివాసధరలు తగ్గని రెండు నగరాల్లో బెంగళూరు సరసన హైదరాబాద్‌ నిలిచింది. గత ఐదేళ్లలో కార్పొరేట్‌ కార్యకలాపాల వృద్ధితోపాటు వార్షిక ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ పరంగా 2014లో 6వ స్థానంలో ఉండగా, 2019లో 2వ స్థానానికి చేరింది. దేశీయ విమాన ప్రయాణాల వృద్ధిరేటు 2014–15లో 5.5 శాతం కాగా 2019–20 నాటికి 6.4 శాతానికి పెరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top