‘సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలి’

KTR Inaugurates Double Bedroom Houses In Rajanna Sircilla - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: త్వరలోనే అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అవినీతికి తావులేకుండా డబుల్‌ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఇంటింటికి మిషన్‌ భగీరథ నీళ్లు ఇస్తున్నామన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో 264 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ళను బుధవారం మంత్రి కేటీఆర్‌, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు హజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..డబల్ బెడ్‌రూమ్‌ ఇల్లు ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. 

గతంలో ఎప్పుడూలేని విధంగా రూపాయి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను అప్పగించామన్నారు. ఇళ్ల వద్ద ఖాళీ స్థలంలో హరితవనం పెంచాలని సూచించారు. వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలని తెలిపారు. చెట్లు పెంచితే కరోనాకష్ట కాలంలో ఆక్సిజన్ సమస్యే ఉండదని హితవు పలికారు. నాలుగు లక్షల 75 వేల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలో ఎంతో మంది సీఎంలు.. ఆడబిడ్డలకు, బీడీలు చుట్టే మహిళలకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడాలేని పెన్షన్‌లు, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ళు, రైతుబందు, ఉచిత విద్యుత్‌ను సీఎం కేసీఆర్‌ ఇచ్చారని కొనియాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top