సింగరేణి కార్మిక గర్జన సభకు హాజరైన జనం (ఇన్సెట్లో) కేటీఆర్ అభివాదం
సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు.. గోదావరిఖని కార్మిక గర్జన సభలో కేటీఆర్ ఫైర్
అదానీ, అంబానీ వంటి వారి కార్పొరేట్ సంస్థలకు సింగరేణిని అప్పగించేలా రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారు
రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా సంక్షోభంలోకి నెడుతున్నారు
ఈ కోల్ మాల్ గోల్ మాల్ చేస్తున్న దొంగ ఎవరు?
సింగరేణి అవినీతిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న కేటీఆర్
సాక్షి పెద్దపల్లి: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ, కార్మికుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలోకి నెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణ ట్రాన్స్‌కోలో 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. అలాగే త్వరలో సింగరేణి సంస్థను అదానీ, అంబానీ వంటి వారి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మోదీలు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా, బొగ్గు ఉత్పత్తి తగ్గుదలకు కార్మికులను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉత్పత్తి అవుతున్న బొగ్గంతా ఎక్కడికి పోతోందని నిలదీశారు. ‘సింగరేణిలో ఈ కోల్ మాల్ గోల్ మాల్ చేస్తున్న దొంగ ఎవరు? సిరుల సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చిన దుర్మార్గుడు ఎవరు? బొగ్గు గనిని అవినీతి ఖనిగా మార్చేసిన దగుల్బాజీ ఎవరు?..’ అంటూ ధ్వజమెత్తారు. సింగరేణి, ఆర్టీసీతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.
కమీషన్లు ముట్టకే టెండర్లు వాయిదా
‘సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. మా హయాంలో 70 మిలియన్ టన్నుల స్థాయికి చేరిన బొగ్గు ఉత్పత్తి.. ప్రస్తుతం 58 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ (ఓబీ) పనుల టెండర్లను సకాలంలో పూర్తి చేయకపోవడమే ఉత్పత్తి తగ్గుదలకు కారణం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో ఓబీ టెండర్లు ఏడుసార్లు వాయిదా పడ్డాయి. దానికి కారణం కమీషన్లు ముట్టకపోవడమే.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ అవి చెల్లించకుండా సంస్థను సంక్షోభంలోకి నెడుతోంది. డీజిల్, జిలెటిన్ స్టిక్స్, సోలార్ ప్రాజెక్టులు, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో అవకతవకలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున జోక్యం చేసుకుని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బావమరిది సృజన్‌రెడ్డి, శోధా కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలపై విచారణ జరపాలి..’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అవినీతి రైజింగ్..ప్రొడక్షన్ ఫాలింగ్
‘ప్రస్తుతం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 4,000 మెగావాట్ల సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి జరగడం లేదు. ఇందుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా కావడం లేదనే కారణాన్ని చూపుతున్నారు. ఉత్పత్తి చేస్తున్న బొగ్గు అంతా ఎక్కడకు పోతోంది? ఎక్కడ మాయమైంది? ఈ బొగ్గును మెక్కిన బకాసురుడు ఎవరు? ఈ బొగ్గును మాయం చేసిన మాయల ఫకీరు ఎవరు? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బొగ్గు కొరత లేదు, కరెంట్ కొరత లేదు? నీళ్లకు కొరత లేదు.
పదేళ్లు బ్రహ్మాండంగా నడిచిన సింగరేణి ఇప్పుడెందుకు ఈ పరిస్థితిలో ఉంది? సింగరేణిలో బొగ్గు నిక్షేపాలు ఈ మూడేళ్లలో తగ్గిపోయాయా? లేదా సింగరేణి కార్మికులు కష్టం చేయడం తగ్గిందా? ఎందుకు బొగ్గు తగ్గిపోయింది? మొన్నీ మధ్య మన నాయకులు మొత్తం సింగరేణి ప్రాంతమంతా పర్యటించి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని నిలదీస్తే.. ‘లేదు లేదు ఉన్నది, బాయిలకాడ ఉంది‘ అని అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. సింగరేణిలో ఇవాళ బొగ్గు ఉత్పత్తి లేదంటే దానికి కారణం కాంగ్రెస్ అవినీతి. బొగ్గు ఏడపోయింది అంటే.. అవినీతి రైజింగ్, ప్రొడక్షన్ ఫాలింగ్..
సంస్థలో కుంభకోణాల కుంభమేళా
సింగరేణిని ఇవాళ ఒక దండుపాళ్యం ముఠా దోచుకుంటున్నట్టు కాంగ్రెసోళ్లు దోచుకుంటున్నారు. రూ.10 వేల కోట్ల మేర కుంభకోణాలు సింగరేణిలో జరిగాయి. సైట్ విజిట్ సర్టిఫికెట్ కుంభకోణం, డీజిల్ కుంభకోణం, జిలెటిన్ స్టిక్స్ కుంభకోణం, సోలార్ కుంభకోణం, జైపూర్ పవర్ కుంభకోణం..ఇలా సింగరేణిలో కుంభకోణాల కుంభమేళా జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ చానెల్ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పిండు. సింగరేణిలో నైనీ కుంభకోణాన్ని ఆయన అడ్డుకోవడంతో ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని. ఆ నిధులు మింగినోడు ఎవడు? మింగుదామనుకున్నోడు ఎవడో ప్రజలకు చెప్పాలి..’ అని కేటీఆర్ అన్నారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
‘సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా, దసరా బోనస్, వారసత్వ ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతోంది. కార్మికుల హక్కులు, సంస్థ భవిష్యత్తు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలి. సింగరేణిని కాపాడే విషయంలో నాయకత్వం కేసీఆర్‌దే. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సింగరేణి, విద్యుత్ సంస్థలు సురక్షితంగా ఉంటాయి..’ అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కేటీఆర్ న్యూ లుక్ వెనుక ‘గోదావరిఖని’ సీక్రెట్
కేటీఆర్ తన కొత్త గడ్డం లుక్ వెనుక ఉన్న కారణాన్ని సభలో సరదాగా బయటపెట్టారు. వచ్చే దారిలో కరీంనగర్లో ఆగినప్పుడు గంగుల కమలాకర్.. ‘అన్న గడ్డం పెంచినావ్?‘ అని అడిగారని, దానికి నేను ‘పోయేది గోదావరిఖనికి, సింగరేణికి కదా.. ఆ మాత్రం గెటప్ ఉండాలి..లేకపోతే నడవదు..‘ అని చెప్పానని తెలిపారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.


