హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36 లోని క్రిస్టల్ క్లబ్ పబ్‌లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మణికొండలో నివసించే యువతి (29) మంగళవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి క్రిస్టల్ పబ్‌కు వచ్చారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో వీరి వెనుక సీట్లో కూర్చొన్న ఓ యువకుడు వాటర్ బాటిల్‌ను యువతి ఉన్న చోటికి వదిలాడు.
తీసుకునే క్రమంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. రాత్రి 12.10 గంటల ప్రాంతంలో సదరు యువతి స్నేహితురాలితో కలిసి బయట నిలబడగా భరత్, మారుతి, డోనాల్డ్ అనే ముగ్గురు యువకులు బయటకు వచ్చి మరోసారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే ఆమె సోదరుడు బయటకు రాగా తీవ్రంగా కొట్టారు. ఆపేందుకు వెళ్లిన ఆమెను దూషించారు.
విషయం తెలుసుకున్న బౌన్సర్లు బయటకు వచ్చి యువకులను కట్టడి చేసేందుకు యతి్నంచగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో బాధిత యువతితో పాటు ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు కాగా, అదే రోజు అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. జరిగిన ఘటన పట్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు భరత్, మారుతి, డోనాల్డ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.