మావోయిస్టు దామోదర్‌ భార్య అరెస్ట్‌.. మిగిలిన దళ సభ్యులు ఎక్కడ..?

Kothagudem: Maoist Damodar Wife Rajitha Arrested Other 4 Missing - Sakshi

సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ భార్య, చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు మడకం కోసి అలియాస్‌ రజిత అరెస్టు సందర్భంగా నెలకొన్న ప్రకంపనలు ఇంకా ఆగిపోలేదు. ఆమెతో పాటు భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించిన మిగిలిన దళ సభ్యులు ఎక్కడున్నారు? వారి నెక్ట్స్‌ టార్గెట్‌ ఏంటనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

24 గంటలు గడిచినా..
ఇటీవల జిల్లాలో మావోయిస్టుల అలికిడి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సానుభూతిపరులను ఏర్పాటు చేసుకుంటూ తమ భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్‌ టీమ్‌లకు అండగా యాక్షన్‌ టీమ్‌లు సైతం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సంచరిస్తున్నట్టు సమాచారం. మావోల కదలికలు పెరగడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్టయ్యారు. కూంబింగ్‌ తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో చర్ల మండలం కూర్నపల్లి, బోదనెల్లి అడవుల్లో రజిత, ధనిలను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా ఈ ఘటనలో మిగిలిన దళ సభ్యులు పారిపోయారని పోలీసులు చెబుతుండగా అంతకు ముందే పోలీసుల అదుపులో రజిత, ధనిలతో పాటు మరో నలుగురు దళ సభ్యులు ఉన్నారంటూ మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ నలుగురికి సంబంధించి పోలీసులు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా మావోయిస్టుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఆ నలుగురు ఏమయ్యారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కాంటాక్ట్‌ మిస్‌ అయ్యారా ?
రజితతో పాటు సంచరిస్తున్న దళ సభ్యులు పోలీసుల రాకను గమనించి తప్పించుకున్నారని, అయితే వారు ఇంకా తమ కాంటాక్టులను సంప్రదించలేదనే వాదన వినిపిస్తోంది. ఆపద సమయంలో ఎవరైనా మావోయిస్టులు దళం నుంచి విడిపోతే తిరిగి కాంటాక్టులోకి వచ్చే వరకు వారు ఎక్కడ ఉన్నారనేది తెలియదు. అయితే రజిత, ధనిలు పోలీసులకు పట్టుబడిన ఘటనలో తప్పించుకున్న మావోయిస్టులు సేఫ్‌ ఏరియాలకు చేరుకునే అవకాశం ఎక్కువని తెలుస్తోంది.

కూర్నపల్లి, బోదనెల్లి అటవీ ప్రాంతాలు ఛత్తీస్‌గఢ్‌కు అతి సమీపంలో ఉన్నాయి. పైగా అడవి దట్టంగా ఉండటం వానలు కురవడాన్ని మావోయిస్టులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా తమ నాయకత్వంతోని కాంటాక్టులోకి వెళ్లి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకసారి వారు కాంటాక్టులోకి వచ్చిన తర్వాత నలుగురు దళ సభ్యుల గురించి  మావోయిస్టు నాయకత్వం ప్రకటన చేయవచ్చని అంచనా. 

అవి గాయాలేనా ?
రజిత ఒంటిపై కమిలిన గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం మధ్యాహ్నం పట్టుడిన మావోయిస్టులను గురువారం వరకు పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా రజితకు ఏమైనా గాయాలు అయ్యాయా  అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి. దీనిపై భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ను వివరణ కోరగా.. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను రిమాండ్‌కు తరలించే వరకు పక్కాగా నిబంధనలు పాటించామని చెప్పారు.

విచారణ సందర్భంగా వారికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. మావోయిస్టులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రజిత, ధనిలను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వీరిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top