వరంగల్: కార్యకర్తలు పది రోజుల నుంచి ఎంతో బాధపడుతున్నారని మాజీమంత్రి కొండా సురేఖ చెప్పారు. సుమంత్ బెయిల్ కోసం కార్యకర్తలను కలవడం ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడున్న నాయకులు పొద్దున ఒక పార్టీలో మధ్యాహ్నం ఒక పార్టీలో తిరుగుతున్నారని అన్నారు. తాను ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదని తెలిపారు.
కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ మరణించాక ఇక్కడున్న గుంట నక్కలు మోసం చేశాయి. కేసీఆర్ సూచనతో వరంగల్ తూర్పులో పోటీ చేసి అప్పటి మంత్రిని 55 వేల మెజారిటీతో ఓడించాను. చల్ల ధర్మారెడ్డి అక్రమంగా సంపాదించాడు. చిన్న తప్పు కానీ, చిన్న మచ్చ లేకుండా మూడు శాఖలను సమర్థవంతంగా నిర్వహించాను. పదవి అనేది అలంకారం మాత్రమే. పని చేయాలనుకుంటే పదవి అక్కర్లేదు. నన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినందుకు నేను బాధపడటం లేదు.
మేము ఏ పార్టీలోకి పోయే ఆలోచన లేదు... కాంగ్రెస్ పార్టీలో పుట్టాము కాంగ్రెస్ పార్టీలో పెరిగాము. అనివార్య కారణాలవల్ల బీఆర్ఎస్ పార్టీలోకి పోయాము.. కానీ, ఎవ‍్వరూ ఆ పార్టీ నుంచి వెళ్లగొట్టలేదు. స్థానిక డివిజన్‌లో కనీసం కార్పొరేటర్‌ను గెలిపించుకునే స్థాయి కూడా సారయ్యకు లేదు. ఇకనుంచి ఎవరైనా మా మీద మాట్లాడాలనుకుంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.
రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నవీన్ రాజ్ భుజాలపై నుంచి 24 మంది కార్పొరేటర్లను గెలిపించుకుందాం. మాకు పైనుండి ఫోన్లు వస్తున్నాయి.. ఎటూ వెళ్లదు అని. మేము పార్టీ మారేది లేదు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తూర్పులో నాకు మళ్లీ కాంగ్రెస్ టికెట్ వస్తది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది’’ అని చెప్పారు.


