6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాహుల్‌ను కోరిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను 6 నెలల ముందే ప్రకటిం చాలని రాహూల్‌గాంధీని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో లాబీయింగ్ చేసే నేతలకు కాకుండా ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడే నాయకులకే టికెట్లు ఇవ్వాలని కోరారు. 2018లో ఎన్నికల్లో పొత్తుల పేరుతో నామినేషన్ల చివరి రోజు జాబితా ప్రకటించడంతో పార్టీకి నష్టం కలిగిందన్నారు.రాహుల్‌కు అర్థమయ్యేలా హిందీలో మాట్లాడారు. ‘నాలాంటి వాళ్లకు పదవులు అవసరం లేదు. సీఎం పదవి అక్కర్లేదు. మంత్రి పదవి త్యాగం చేసి తెలంగాణ కోసం సోనియాను ఒప్పించాం. దళితుడిని సీఎం చేయని కేసీఆర్‌కు మెడ మీద తల ఉందా?’ అని ప్రశ్నించారు. ‘సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్, బీజేపీ ఎవరితో పొత్తు వద్దు. ఒంటరిగా పోటీ చేద్దామని కార్యకర్తలు కోరుతున్నారు’ అని చెప్పారు.
‘కల్వకుంట్ల కరప్షన్ రాజ్యం’: మధుయాష్కీ
కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షన్ రాజ్యం అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. 6 పర్సెంట్‌తో మొదలై.. 30 పర్సెంట్ ప్రభుత్వంగా మారి.. ఉద్యమ పార్టీగా చెప్పుకునే ఈ దొంగలకు ఎనిమిదేళ్ల కాలంలో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసులు వస్తాయి. కొత్త కలెక్టరేట్లు వస్తాయి. ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు వస్తాయి. గరీబోళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రావు’ అని మండిపడ్డారు.