జ్యోతిప్రజ్వలన చేస్తున్న మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి. చిత్రంలో దిల్‌రాజు, ప్రియాంక,నర్సింగ్‌రావు, ఆనంద్‌రావు తదితరులు
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినిమాలపరంగా హైదరాబాద్ ప్రొడక్షన్ హబ్‌గా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ఫిల్మ్ డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నగరంలో మొదటిసారి ప్రారంభించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగ అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయస్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. భారత్ నుంచే కాకుండా స్పెయిన్, ఈజిప్ట్, యూకే, యూఎస్‌ఏ, సౌత్ కొరియా వంటి దేశాల నుంచి మొత్తంగా 704 చిత్రాలు ఎంట్రీలుగా రావడం అభినంద నీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక, దర్శకులు ఉమామహేశ్వరరావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.


