43 కేంద్రాలు .. 42 లక్షల డయాలసిస్‌ సెషన్లు.. కిడ్నీ రోగులకు ఆరోగ్యశ్రీ అండ

Kidney Dialysis Patients In Telangana Get Treated Under Aarogyasri - Sakshi

ఏడేళ్లలో వేలాది మందికి ఉచితంగా సేవలు..

అత్యధికంగా హైదరాబాద్‌లో 10 లక్షల డయాలసిస్‌ సెషన్లు..

అత్యల్పంగా ములుగులో 5,142 చికిత్సలు.. మొత్తం రూ.575 కోట్ల వ్యయం     

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూత్రపిండాల వైఫల్యం కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో కొందరికి క్రమం తప్పకుండా డయాలసిస్‌ (రక్తశుద్ధి) చేయాల్సి ఉంటోంది. కొందరికి వారానికి రెండుసార్లు... మరికొందరికి మూడు సార్లు డయాలసిస్‌ చేయాల్సిన అవసరముంటుంది. అయితే ఇదెంతో ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ప్రైవేటు ఆస్పత్రులు వేలల్లో వసూలు చేస్తుండటంతో పేదలు, మధ్యతరగతి రోగులకు ఈ చికిత్స భారంగా మారుతోంది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్‌ సేవలు అందజేస్తోంది. ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా కాపాడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 కేంద్రాల ద్వారా రోగులకు పైసా ఖర్చు లేకుండా ఉచిత డయాలసిస్‌ నిర్వహిస్తున్నారు. డయాలసిస్‌ అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఈ చికిత్సల కోసం ప్రభుత్వం 2014–15 నుంచి 2021–22 నవంబర్‌ 16 వరకు రూ.575.92 కోట్లు వెచ్చించింది. 

పెరుగుతున్న కిడ్నీ వైఫల్యాలు 
రాష్ట్రంలో 2014–15లో 5,598 మంది మూత్రపిండాల వైఫల్య బాధితులు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదు కాగా..ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. ఆరేళ్లలో దాదాపు 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. 2015–16లో ఈ సంఖ్య 6,853కి చేరగా, 2016–17లో 7,612, 2017–18లో 8,786, 2018–19లో 10,452, 2019–20లో 10,848కి చేరినట్లు ఆరోగ్యశ్రీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2020–21లో మాత్రం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 10,610గా నమోదయ్యింది. ఎప్పటికప్పుడు కొత్త కేసులు నమోదవుతున్నా ఏడాదికి సుమారు 2 వేల మందికి పైగా బాధితులు మృతి చెందుతుండడంతో గత మూడేళ్లుగా ఈ రోగుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల చోటు చేసుకోలేదని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఆరోగ్యశ్రీతో పాటు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల్ని కూడా లెక్కిస్తే ఈ రోగుల సంఖ్య రెట్టింపు ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

హైదరాబాద్, రంగారెడ్డిలో అత్యధికం 
మూత్రపిండాల వైఫల్య బాధితుల్లో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. 02.06.2014 నుంచి 16.11.2021 వరకు రాష్ట్రంలో మొత్తం 42.61 లక్షల డయాలసిస్‌ సెషన్లు నిర్వహించగా హైదరాబాద్‌లో అత్యధికంగా 10,42,660 చికిత్సలు చేశారు. ఆ తర్వాత రంగారెడ్డిలో 4,87,696 చికిత్సలు జరిగాయి.

ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో కూడా లక్షకు పైగా డయాలసిస్‌ చికిత్సలు జరిగాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 5,142 డయాలసిస్‌ చికిత్సలు నమోదయ్యాయి. మూత్రపిండాల మార్పిడి చికిత్సలు ఎక్కువగా జరగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. రోగుల సంఖ్య పెరుగు తుండడంతో డయాలసిస్‌
మెషీన్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.   

పేదలపై పంజా..
దేశంలోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా లక్ష మంది కిడ్నీ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో తేలింది. నిమ్స్‌ ఆసుపత్రి వైద్యుల నివేదిక ప్రకారం 2015లో ఏకంగా 1.36 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో చనిపోయారు. దశాబ్దం క్రితం అంతగా లేని కిడ్నీ వ్యాధి ఇప్పుడు నాలుగైదు రెట్లు పెరిగింది.

షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. వివిధ సంస్థలు దేశంలోని 52,273 మంది వ్యాధిగ్రస్తులపై సర్వే నిర్వహించాయి. ప్రాంతం, సామాజిక, ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేల లోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3 శాతం మంది ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేల లోపు ఆదాయం కలిగినవారు 42.9 శాతం మందికి కిడ్నీ వ్యాధికి గురయ్యారు. దీనిని బట్టి కిడ్నీ రోగుల్లో ఎక్కువగా పేదలే ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top