కొమురం భీం ఆశయసాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది 

KCR Says Govt Committed To Fulfilling Ideals Of Komaram Bheem - Sakshi

త్వరలోనే ఆదివాసీ భవన్‌ ప్రారంభిస్తాం: సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మా గూడెం–మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వమే నిజం చేసిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం జయంతి సందర్భంగా భీం సేవలను స్మరిస్తూ కేసీఆర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఘన నివాళి అర్పించారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, భీం జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని వెల్లడించారు.

భీం పోరాట ప్రదేశమైన జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేశామని, భవిష్యత్‌ తరాలకు ఆయన పోరాట పటిమను తెలియజేసే విధంగా స్మారక చిహ్నం, స్మృతివనంతో పాటు గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఆదివాసీ భవన్‌ నిర్మాణం చేపట్టామని, త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. కొమురం భీం జల్, జంగల్, జమీన్‌ నినాద స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, స్వరాష్ట్ర అభివృద్ధి పథంలోనూ ఉందన్నారు. అడవులు, ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు ఉండే ప్రేమ గొప్పదని, వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top