హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కేసీఆర్‌

Kcr Returns to Telangana After 4 Days Delhi Tour - Sakshi

నాలుగు రోజులు ఢిల్లీ, చండీగఢ్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 20న ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన పలువురితో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ నెల 21న ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌తో రెండున్నర గంటల పాటు సమావేశమయ్యారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలతో పాటు మొహల్లా క్లినిక్‌లను సందర్శించారు.

సీనియర్‌ పాత్రికేయులు ప్రణయ్‌రాయ్‌తో జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై భేటీ అయ్యారు. 22న ఉదయం కేజ్రీవాల్‌ నివాసంలో ప్రత్యేక భేటీ అనంతరం ఆయనతో కలిసి చండీగఢ్‌కు వెళ్లారు. అక్కడ పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో కూడా కలిసి రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కింద రూ.3 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.

అనంతరం గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను పరామర్శించారు. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌ సోమవారం వ్యవసాయ ఆర్థిక నిపుణులు అశోక్‌ గులాటీతో భేటీ అయ్యారు. రాత్రి 7.30కి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం వెంట పార్టీ ఎంపీలు సంతోష్‌ కుమార్, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top