12కిపైగా స్థానాలు మనవే | KCR Comments On Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

12కిపైగా స్థానాలు మనవే

Mar 11 2024 5:58 AM | Updated on Mar 11 2024 6:56 PM

KCR Comments On Lok Sabha Elections - Sakshi

పార్టీ నుంచి వెళ్లే వారి కోసం ఆందోళన వద్దు: కేసీఆర్‌

నలభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశా

రాష్ట్రానికి నష్టం జరిగేలా కాంగ్రెస్‌ నేతలు తప్పులు చేస్తున్నారు

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ డజనుకు పైగా స్థానాల్లో పైచేయి సాధిస్తుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీఆర్‌ఎస్‌ మెరుగైన ఓట్లు సాధిస్తుందని, ఓట్ల శాతం కూడా చాలా మెరుగవుతుందన్నారు.

హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసంలో ఆదివారం జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ కీలక నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు పార్టీ నేతలు, కేడర్‌ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

రాష్ట్రంలో పాలన ముందుకు సాగడం లేదు
‘కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు కావస్తున్నా పాలన ముందుకు సాగడం లేదు. అవగాహన లేమితో అధికార పార్టీ నేతలు రాష్ట్రానికి నష్టం జరిగేలా వరుస తప్పులు చేస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న తప్పులు, ఆగడాలను ప్రజల్లో ఎండగడుదాం. పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నా నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్న ఘటనలు ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉండే వారికి ఆత్మ విశ్వాసం అవసరం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై పనిచేసే వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు.’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

జహీరాబాద్‌ అభ్యర్థిగా గాలి అనిల్‌ కుమార్‌?
జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా గాలి అనిల్‌ కుమార్‌ పేరు దాదాపు ఖరారైంది. ఒకటి రెండు రోజుల్లో అనిల్‌ పేరును కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ కీలక నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు.

కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్‌ కుమార్‌ సరైన అభ్యర్థి అవుతారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. 2019 ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గాలి అనిల్‌ కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.

హరీశ్‌కు సమన్వయకర్తల నియామకం బాధ్యతలు
జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయకర్తల నియామకం బాధ్యతను మాజీ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించినట్లు సమాచారం. కాగా మెదక్‌ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేత బీరయ్య యాదవ్‌ ఆదివారం కేసీఆర్‌ను కలిశారు.

పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. కేసీఆర్‌తో జరిగిన భేటీలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement