దారుణం: అప్పుడే పుట్టిన బిడ్డను ముళ్లపొదల్లో.. | Karimnagar : New Born Baby In Bushes | Sakshi
Sakshi News home page

కన్నపేగే కాదనుకుంది?

Feb 9 2021 9:30 PM | Updated on Feb 9 2021 9:40 PM

Karimnagar : New Born Baby In Bushes - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వేములవాడ: పేగు బంధం మరిచింది.. రక్తసంబంధాన్ని కాదనుకుంది.. కడుపున మోసిన ప్రతిరూపాన్ని వద్దనుకుంది.. లోకం పోకడ తెలియకముందే ముళ్లపొదల్లో పడేసి తన దారిన తాను వెళ్లిపోయింది.. కారణాలు ఏమో తెలియదు గానీ.. అమ్మతనం మంట గలిసేలా వ్యవహరించింది.. కాకులు పొడిచి, చీమలు కుట్టి, పందులు కొరికేస్తుండగా పసికూన కేకలు వేసింది.. సరిగా అర్థం చేసుకోలేని స్థానికులు.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని నివ్వెరపోయారు..

స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడలోని న్యూఅర్బన్‌కాలనీలో సోమవారం సాయంత్రం చిన్నపిల్లలు రేగుపండ్లు తెంపుకునేందుకు సమీప ముళ్లపొదల్లోకి వెళ్లారు. అక్కడ పసికందు కనిపించింది. ఈ విషయాన్ని కాలనీవాసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు అక్కడికి చేరుకొని చూసే సరికే అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహం కనిపించింది. అప్పటికే కుడిచేయి కనిపించలేదు. వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వెంకటేశ్‌ ఘటనాస్థలికి చేరుకొని మున్సిపల్‌ సిబ్బంది సహాయంతో శిశువు మృతదేహాన్ని  సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించనున్నట్లు సీఐ తెలిపారు. శిశువును పడేసింది ఈ ప్రాంతానికి చెందినవారా? లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా? అనే విషయమై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement